జగదీష్ రెడ్డి అనుచరుల భూ దందాపై న్యాయ విచారణ జరిపించాలి: ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాటి మంత్రి జగదీష్ రెడ్డి అండదండలతో ఆయన అనుచరులు, ప్రజాప్రతినిధులు,పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడుతున్నారని టిజెఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని,ఫలితంగా వారంతా ఈ పదేళ్లలో భూ మాఫీయాగా మారారని,ఈ భూఆక్రమణలపై న్యాయ విచారణ చేసి,బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కుంట్ల ధర్మార్జున్ డిమాండ్ చేశారు.

టిజెఎస్ జిల్లా ఆఫీస్ లో ఆయన మాట్లాడుతూ జగదీష్ రెడ్డి కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను తన అనుచరులకు కట్టబెట్టారని,కలెక్టరేట్ భవనానికి ఆనుకొని ఉన్న కుడకుడ శివారులోని 126 సర్వే నెంబర్లో నాటి అధికార పార్టీ నేత,రియల్ ఎస్టేట్ వ్యాపారి కుడకుడ స్మశానవాటిక చుట్టూ గతంలోనే కబ్జా పెట్టి,ప్లాట్లు చేసి అమాయకులకు అంటగట్టారని,ఇప్పుడేమో తన బినామీలు, చనిపోయిన తన బంధువుల పేరు మీద అక్రమంగా పట్టాలు చేయించుకున్నాడన్నారు.

కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అదే సర్వే నెంబర్ లో లేని ఇల్లు ఉన్నట్టుగా చూపించి ఫోటో షాప్ మార్ఫింగ్ తో రెగ్యులరైజ్ చేయించుకున్నారని,ఇది పూర్తిస్థాయిలో జగదీష్ రెడ్డి అండదండలతోటి జరిగిందన్నారు.

ఇల్లులేని నిరుపేదలు ఏళ్ల తరబడి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి రెగ్యులరైజ్ చేయుట గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన 58,59 జీవో నెంబర్లను అడ్డం పెట్టుకొని,కొన్ని వృత్తులలో వున్నవారిని ఒకరిద్దరి పేద వాళ్ళని ముందు పెట్టి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు,జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు,వార్డుమెంబర్లు,రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ భార్యల,బినామీల పేరు మీద రెగ్యులర్ పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ జీవోలను దుర్వినియోగం చేసి,ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన అక్రమణదారులకు సహకారాన్ని అందించిన రెవెన్యూ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరొకవైపు పట్టణ నడిబొడ్డులో ఉన్న సర్వే నెంబరు 817,816,818 లలో ఉన్న ఇనాం భూములను క్షుణ్ణంగా పరిశీలించి,అసలైనల లబ్ధిదారులకు అందజేయాలని కోరారు.

817 లో ఎకరం 38 గుంటల భూమి ఉండగా అందులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వం కేటాయించగా మిగతా భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని,వారు ఏ పార్టీలో ఉన్నా వారి ఆక్రమణ నుండి ఆ భూమిని విముక్తి చేసి ప్రభుత్వ కార్యాలయాలకు లేదా అసలైన నిరుపేదలకు అందజేయాలన్నారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్,జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా లీగల్ సెల్ జిల్లా కో కన్వీనర్ వీరేశ్ నాయక్, పట్టణ పార్టి కార్యదర్శి పాండు గౌడ్,ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దేవత్ సతీష్,మైనార్టీ సెల్ పట్టణ కన్వీనర్ ఫరీద్,నాయకులు మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మనోజ్ కుమార్తె నామకరణ వేడుక.. పాప పేరేంటో తెలుసా?