భారత్‌కు వచ్చేందుకు ఎంపీ ద్వారా యత్నాలు.. అంతలోనే: దక్షిణాఫ్రికాలో తెలుగు యువకుడు మృతి

దేశం కానీ దేశంలో అనారోగ్యంతో బాధపడుతూ స్వదేశానికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఓ తెలుగు యువకుడి కలలు కల్లలయ్యాయి.

మాతృదేశానికి వెళ్లకుండానే అతను పరాయి దేశంలోనే ప్రాణాలు కోల్పోయాడు.ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రవాస భారతీయుడి దీన గాథ ఇది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా రూరల్ మండలం గరికపాడుకు చెందిన హర్షవర్థన్ (27) స్థానికంగా పీజీ పూర్తి చేశాడు.

ఈ క్రమంలో ఉద్యోగం నిమిత్తం గతేడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడి ఓ సంస్థలో విధుల్లో చేరాడు.

అంతా సాఫీగా సాగుతున్న సమయంలో హర్షవర్థన్ కొద్దిరోజుల కిందట తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

దీంతో అతని స్నేహితులు హర్షవర్థన్‌‌ను ఆసుపత్రిలో చేర్చి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.విషయం తెలుసుకున్న హర్షవర్థన్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఎలాగైనా కుమారుడిని భారతదేశానికి రప్పించాలని స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును కలిశారు.

వీరి పరిస్ధితి చూసి చలించిపోయిన నామా.తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో హర్షవర్థన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం ఉదయం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచాడు.

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభంకావడంతో హర్షవర్థన్ స్నేహితుల సాయంతో భారత్‌కు వెళ్లడానికి విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు.

కానీ ఇంతలోనే ఇలా జరగడంతో అతని తల్లిదండ్రులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.హర్షవర్థన్ రెడ్డి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.