తెలంగాణలో పట్టుకోల్పోతున్న టీఆర్ఎస్.. కేసీఆర్ మౌనం అందుకేనా?
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర్నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ రథసారథిగా అన్నీ తానై బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా దూసుకెళ్తున్న కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు? ప్రస్తుతం ఈ ప్రశ్న టీఆర్ఎస్ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను కొడుకు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించడంతో ఆయన దాదాపు 100 డివిజన్‌లలో ప్రచారం చేశారు.
అయితే తెరాస ఆశించిన స్థాయిలో మాత్రం జీహెచ్ఎంసీ ఫలితాలు రాకపోవడంతో ప్రస్తుతం పార్టీ వర్గాల్లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది.
మొన్న జరిగిన దుబ్బాక ఉపఎన్నికలోనూ తెరాసకు భంగపాటు ఎదురవడం, తాజాగా బల్దియా ఎన్నికల్లో అనుకున్న మేర సీట్లు రాకపోవడంతో టీఆర్ఎస్ అధిష్టానం పార్టీలో ప్రక్షాలన చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే కేటీఆర్ మాత్రమే ఈ వ్యవహారం చూస్తుండటం, కేసీఆర్ ఇంకా సైలెంట్‌గానే ఉండటంతో అసలు ఆయన మౌనం వెనుక ఆంతర్యం ఏమిటా అని అందరూ ఆలోచిస్తున్నారు.
బీజేపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నట్లుగా నిజంగానే తెలంగాణలో టీఆర్ఎస్ పట్టుకోల్పోతుందా అనే ప్రశ్నకు కేసీఆర్ మౌనం మరింత ఆజ్యం పోస్తుందని చెప్పాలి.
దుబ్బాక దెబ్బ నుండి కోలుకోక ముందే, ఇలా బల్దియాలో తమకు సగానికి సగం సీట్లు పడిపోవడంతో కేసీఆర్ తీవ్ర ఆలోచనలో పడినట్లు సమాచారం.
అంతేగాక రాబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కూడా ఒకవేళ సేమ్ సీన్ రిపీట్ అయితే ఏం చేయాలి అనే అంశంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నాడని, అందుకే ఆయన ఎక్కువగా ప్రజలముందుకు రావడం లేదని తెరాస వర్గాలు అంటున్నాయి.
ఇలా వరుసగా తమ పార్టీ ప్రజల్లో నమ్మకాన్ని ఎందుకు కోల్పోతుంది, తమ పార్టీలో నేతలు సరిగా లేరా అనే అంశంపై కేసీఆర్ వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా 2023 సాధారణ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్‌పై ప్రజల్లో పూర్వ నమ్మకాన్ని తీసుకురావడమే ధ్యేయంగా, మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి వారిలో టీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నాడని, అందుకే ఆయన ప్రస్తుతం మౌనంగా ఉన్నాడని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.
మరి కేసీఆర్ మౌనం వెనుక నిజమైన కారణం ఇదేనా, లేక వేరే ఏదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.
సందీప్ రెడ్డి వంగ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యే అవకాశం వచ్చిందా..?