అధికార పక్షానికో న్యాయం,విపక్షాలకో న్యాయమా? అంటూ అసహనం వ్యక్తం చేసిన ప్రజలు

యాదాద్రి భువనగిరి జిల్లా:యాసంగి సీజన్ వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన రాస్తారోకో కార్యక్రమం ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్-విజయవాడ 65వ,జాతీయ రహదారిపై చేపట్టిన రాస్తారోకో కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి,జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొనడంతో టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.

ఒక వైపు ఎండ మరో వైపు రాస్తారోకోతో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాల్లోని చిన్నారులు ఉక్కబోతను తట్టుకోలేకపోయారు.

అంబులెన్స్ సైతం ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని,బయటకు వచ్చేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది.

ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ వచ్చేందుకు వీల్లేనంతగా ట్రాఫిక్ జామ్ లో కావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం గెలిపిస్తే వాటిని పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేయడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పక్షానికో న్యాయం,విపక్షాలకు ఒక న్యాయమా? అంటూ పలువురు ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలు, రాస్తారోకోలపై ఉక్కుపాదం మోపి అణిచివేశారని, ప్రశ్నించే గొంతులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఉద్యమాలను అణిచి వేసే ప్రయత్నంలో భాగంగా ముందస్తు అరెస్టులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేశారని,అదే ప్రభుత్వం ఇప్పుడు రోడ్డు ఎక్కడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేశారు.

ఈ స్టార్ హీరోల భార్యల గురించి మీకు తెలుసా.. ఆ వ్యాపారాల్లో అదుర్స్ అనిపించారుగా!