దీక్షలతో దడ పుట్టించబోతున్న పవన్ ? ఆ తేదీన ఏం చేయబోతున్నాడంటే ?

ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం అర్థం కావడం లేదు.

వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ, బలం పెంచుకునేందుకు బిజెపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

అయితే బిజెపి తమతో కలిసి ప్రభుత్వంపై పోరాడేందుకు ముందుకు రాకపోగా, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడం, సొంతంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుండటం, ఇలా అనేక పరిణామాలు పవన్ కు ఆగ్రహం కలిగిస్తూనే వస్తున్నాయి.

ముఖ్యంగా జనసేన తరపున అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపగా, మొదట్లో బిజెపి కూడా పవన్ కు జత కలిసి పోరాటాలు చేసింది.

కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిజెపి, జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లాయి.

కానీ కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు అమరావతికి మద్దతుగా మాట్లాడకపోగా, మూడు రాజధానులకు మద్దతుగా వ్యవహరించడంతో ఇక కేంద్ర బిజెపి పెద్దలు సైతం, రాష్ట్ర రాజధాని విషయంలో జోక్యం చేసుకోమని చెబుతూనే జగన్ కు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు.

దీంతో అమరావతి ఉద్యమం చేపట్టిన పవన్ పరిస్థితి ఎటూ కాకుండా అయిపోయింది.దీంతో పవన్ సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు.

కానీ ప్రస్తుతం బిజెపి, వైసిపి ఈ రెండూ ఉమ్మడిగా ముందుకు వెళ్లే ఆలోచనతో ఉండటం వంటి పరిణామాలతో ఇక బీజేపీని నమ్ముకుంటే జనసేన పార్టీ బలోపేతం అవ్వదని, సొంతంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించి, బలం పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఈ మేరకు త్వరలోనే ఏపీకి రాబోతున్న పవన్  పార్టీలో కొత్త నియామకాలు చేపట్టడంతో పాటు, అమరావతికి మద్దతుగా రైతుల తరపున పోరాటం చేసేందుకు ఈనెల 12వ తేదీన విజయవాడ, గుంటూరులో దీక్ష చేపట్టేందుకు జనసేన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేవలం అమరావతి ఉద్యమంతో సరిపెట్టకుండా, ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల విషయంలో ప్రజల తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో బిజెపి తమతో కలిసి వచ్చినా, రాకపోయినా ఇక ఆ పార్టీని పెద్దగా పట్టించుకోకుండా సొంతంగా ఏపీలో బలపడాలి అనేది పవన్ ప్లాన్ గా కనిపిస్తోంది.

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!