జనసేనపై మీడియా కుట్ర ?
TeluguStop.com
జనసేన పార్టీ రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కోవడం, ఆ పార్టీకి సరైన రాజకీయ విధానాలు లేకపోవడం, పార్టీని ముందుకు నడిపించడంలో పవన్ అనేక తప్పటడుగులు వేయడం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోలేకపోవడం, ఇవన్నీ నిజమే అయినా, జనసేన పై రాజకీయంగా, మీడియా ద్వారా ఒక రకమైన వివక్ష జరుగుతున్నట్టుగా జనసైనికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జనసేన 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందినా, ఎక్కడా ఆ పార్టీ కార్యకర్తల్లో కానీ, అభిమానుల్లో కానీ, నిరుత్సాహం కనిపించడం లేదు.
అధినేత పవన్ ను ఎప్పటికైనా సీఎంగా చూడాలనేదే వారి అభిమతం గా కనిపిస్తోంది.
అసలు పార్టీ పిలుపు ఇచ్చినా, ఇవ్వకపోయినా, క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు స్వచ్ఛందంగానే పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంలో పైచేయి సాధిస్తూ వస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో అనేక సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీని ప్రజలు మర్చిపోకుండా, కార్యక్రమాలు నిర్వహిస్తూనే వస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలోనూ, అందరికంటే ఎక్కువగానే జనసైనికులు యాక్టివ్ గా ఉంటూ, పార్టీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కానీ, సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు అన్నిటినీ, భుజాన వేసుకుని మోస్తున్నారు.
ఈ విషయంలో పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినా, రాకపోయినా అవి ఏవీ పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఎక్కడైనా, ఏదైనా ప్రజా సమస్యలు తలెత్తినా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారన్నా, జనసైనికులు వేగంగా స్పందిస్తున్నారు.
కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.అలాగే కొన్ని చోట్ల ప్లాస్మా దానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఎవరికైనా అవసరమైతే సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్ లు పెడుతూ, ప్లాస్మా దానం చేయవలసిందిగా కోరుతూ రావడం, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలతో, నిత్యం ప్రజల్లో మమేకం అవుతున్నారు.
జనసేవ పేరుతో జనసైనికులు ఈ తరహా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నా, మీడియాలో మాత్రం ఈ కార్యక్రమాల గురించి ఎక్కడా ప్రచారం అవ్వకపోవడం, అసలు జనసేనకు సంబంధించిన వార్తలు ఏవి మీడియాలో హైలెట్ అవ్వకపోవడం, వంటివి జన సైనికులకు ఆగ్రహం కలిగిస్తోంది.
ప్రస్తుతం వరదల కారణంగా ఏపీ అతలాకుతలం అవుతోంది.ఈ సమయంలో జనసేన తరపున బాధితులను పరామర్శించి, వారికి నిత్యావసరాలు అందిస్తూ, జనసైనికులు జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.
కానీ మీడియాలో మాత్రం జనసేన కి సంబంధించి నెగిటివ్ వార్తలు మాత్రమే ఫోకస్ అవుతున్నాయి.
అసలు తమపై ఈ వివక్ష ఏమిటో ఇప్పటికీ జనసేన కార్యకర్తలకు అంతు పట్టడం లేదు.
తెలుగు మీడియా జనసేనపై కక్ష సాధిస్తుందని, ఇతర పార్టీలు చేస్తున్న కార్యక్రమాలు మాత్రమే వారికి కనిపిస్తున్నాయి అని, జనసేన ను పరిగణలోకి తీసుకోవడం లేదంటూ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల్లో జలుబు తగ్గాలంటే ఈ టీ తాగండి!