మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు అన్యాయం

నల్లగొండ జిల్లా:కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదింప చేసుకొన్న మహిళా రిజర్వేషన్ (128వ రాజ్యాంగ సవరణ) బిల్లులో దేశంలోని మహిళల్లో 50 శాతానికిపైగా వున్న ఓబిసి మహిళలకు తీరని అన్యాయం జరిగిందని, అలాగే 15 శాతంగా వున్న ముస్లిం మైనారిటీ మహిళలకు కూడా అన్యాయం జరిగిందని, మహిళా సాధికారత లక్ష్యంగా బిల్లును ప్రవేశపెడుతోన్నమన్న ప్రభుత్వ వాదనలో పసలేదని,ఎందుకంటే మొత్తం మహిళల్లో 65 శాతం మహిళలను శాసనాలు రూపొందించే వ్యవస్థల నుండి దూరం చేసి,మహిళా సాధికారత సాధిస్తామనడం పెద్ద బూటకమని,సామాజిక న్యాయసూత్రానికి విరుద్ధమని జనతంత్ర శ్రామిక రాజ్యాధికార సంఘం నేత జెఎస్ఆర్ జన గర్జన అన్నారు.

లోక్సభలో 543 స్థానాలుండగా రాష్ట్రాల శాసనసభల్లో వివిధ సంఖ్యలో ఎంఎల్ఎలు ఉంటారు.ఈ బిల్లు ప్రకారం వాటిలో 33 శాతం మహిళలకు రిజర్వు చేస్తారు.

ఎస్సి,ఎస్టిలకు ఇప్పటికే రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఉన్నాయి.కనుక,వారి వారి 15 శాతం,7 శాతం రిజర్వుడు స్థానాలలో నుండి 33 శాతం స్థానాలను వారి వారి మహిళలకు కేటాయిస్తారు.

ఆ విధంగా 15+7=22 శాతం పోను మిగిలిన 78% స్థానాలను ఆధిపత్య కులాల మహిళలకు ఈ బిల్లు కట్టబెడుతుంది.

ఎందుకంటే,ఆధిపత్య కుల - సంపన్న వర్గాల మహిళలతో ఓబిసి, మైనారిటీ వర్గాల మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీపడజాలరు.

బలవంతులతో బలహీనులు కుస్తీపట్టలేరు గదా! కనుకనే 73,74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థల్లో (పంచాయితీలు, మున్సిపాలిటీలు) ఓబిసి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల సదుపాయం కల్పించారు.

కొన్ని రాష్ట్రాల్లో అది 50 శాతం వరకూ పెంచారు కూడా.ఆవిధంగా చూస్తే,ఈ 128వ రాజ్యాంగ సవరణ బిల్లు 73,74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు వ్యతిరేకం.

మరి ఒకే పార్లమెంటు పరస్పర విరుద్ధమైన రెండు రాజ్యాంగ సవరణ చట్టాలను చెయ్యవచ్చునా! ఒకవైపున దిగువస్థాయి స్థానిక సంస్థల్లో ఓబిసి.

మహిళలకు రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా కల్పించి, మరోవైపున శాసనాలు చేసే ఉన్నత స్థాయిగల పార్లమెంటు,అసెంబ్లీలలో రిజర్వేషన్లు నిరాకరించడం ద్వంద్వ నీతికాదా? వివక్షకాదా?కుట్రపూరితం అవదా?అత్యధిక సంఖ్యాకులైన 65 శాతానికిపైగా వున్న ఓబిసి,మైనారిటీ మహిళలకు ఇంత బరితెగించి అన్యాయాన్ని తలపెట్టిన సవరణ చట్టానికి ఒక్క మజ్లిస్ పార్టీ తప్పా,అన్ని పార్టీలూ ఓట్లు వేసి నెగ్గించడం అతి పెద్ద రాజకీయ విషాదం.

మాటల్లో ఓబిసి మహిళలకు కూడా 33 శాతంలో వాటా కల్పించాలని కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు కోరినా,ఆ మాటలను అహంకారపూరిత అధికార పార్టీ వాటిని లెక్కచెయ్యలేదు.

ఆ పార్టీలు కూడా,తమ మాటమీద చివరి వరకూ నిలబడలేదు.తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలైన బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్,ప్రతిపక్ష కాంగ్రెస్,టిడిపి కూడా బిసి వ్యతిరేక బిల్లును బలపరచడంలో పోటీలు పడ్డాయి.

మితిమీరిన, అర్హతలేని గౌరవాన్ని కులాధిపత్య స్వభావంగల బిల్లుకు అందించాయి.తమకున్న అసలు ఆధిపత్య కుల స్వభావాన్ని కూడా ఆ రూపంలో బహిర్గతం చేసుకొన్నాయి.

అయితే, బిసి,ఎస్సి సామాజిక స్వభావంగల రాజకీయ పార్టీలు పార్టీలు కూడా ఓబిసి,మహిళల రిజర్వేషన్ కోటా గురించి మాటలకే పరిమితం అవడం,ఓబిసివ్యతిరేక పక్షపాత బిల్లుకు అనుకూలంగా పార్లమెంటులో ఓట్లు వెయ్యడం మరో విషాదం.

కమ్యూనిస్టు పార్టీలు అసలే నోరు మెదపకుండా, బిల్లును బలపరచడం వారి కరుడు గట్టిన ఆధిపత్య కుల స్వభావానికి నిదర్శనం.

ఇక అన్ని పార్టీల్లోనూ విదిలించిన బిచ్చంలాంటి పదవులకు అతుక్కుపోయిన రాజకీయ బానిసత్వ ఓబిసి ఎంపిలు,తమ తమ రాజకీయబాసుల మెరమెచ్చుల కోసమే సహజంగా వ్యవహరించి బిల్లుకు అనుకూలంగా రెండు చేతులెత్తేశారు.

భారత రాజ్యాంగం అస్వశ్యతకు, అణచివేతకు,వివక్షకు, సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబాటుతనానికీ గురైన సామాజిక వర్గాలకు మాత్రమే,సమానత్వ లక్ష్యసాధన దిశలో భాగంగా రిజర్వేషన్లు కల్పించింది.

అయితే, బిసిగా చెప్పుకొంటోన్న నరేంద్రమోదీ( Narendra Modi ) ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఆధిపత్య కులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పేరుతో 10 శాతం రిజర్వేషన్లు 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కల్పించారు.

దశాబ్దాలుగా కోరుకొంటోన్న చట్టసభల్లో ఓబిసిలకు రిజర్వేషన్లు కల్పించే అంశం జోలికే ఆ “బిసి” ప్రధాని వెళ్లడం లేదు.

ఇప్పుడు తాజాగా అదే “బిసి” ప్రధానమంత్రి ఓబిసిలను పూర్తిగా మినహాయించి,20శాతం కూడాలేని ఆధిపత్య కులాల మహిళలకు 80శాతం రిజర్వేషన్లు శాసనాలు చేసే అత్యున్నత అధికారం కలిగిన పార్లమెంటు,అసెంబ్లీలలో రెండు రోజుల్లో కల్పించారు.

ఈ మొత్తం అంశాన్ని లోతుగా పరిశీలిస్తే,“వొడ్డించేవాడు మనవాడు,బిసిల వాడు కాదు" అని తేటతెల్లమౌతోంది.

ఇక ఓబిసిలకు మిగిలింది తమ సొంతకాళ్ళ మీద తాము నిలబడటమే.అనగా హక్కుల కోసం ఉద్యమించడం.

రాజ్యాధికారం కోసం పోరాడటం.తక్షణ కార్యాచరణ రీత్యా ప్రధానంగా దిగువ పేర్కొన్న అంశాల ప్రాతిపదికగా ఓబిసిలు సంఘటి తమవ్వాలి.

ఐక్యంగా ఉద్యమించాలి.వివిధ బిసి సంఘాలుగా,కుల సంఘాలుగా,ఇంకా వివిధ రూపాల్లో విడివిడిగా పనిచేస్తోన్న బిసిలు ఉమ్మడి వేదికని ఏర్పాటు చేసుకొని,ఉమ్మడి పోరాటాన్ని సాగించాలి.

ఈ 128 సవరణ బిల్లుకు ఓబిసిలకు ప్రాతినిధ్యం కలిగించే మరో సవరణ చట్టాన్ని సాధించుకోవాలి.

ఈ లక్ష్యసాధనలో భాగంగా జరుగుతోన్న సామాజిక న్యాయ పోరాటాలకు జన తంత్ర శ్రామిక రాజ్యాధికార సంఘం జెఎస్ఆర్ జన గర్జన సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది.

దేశవ్యాప్తంగా ఉన్న బిసి సంఘాల,కుల సంఘాల నాయకులు కార్యకర్తలు ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని కోరుతుంది.

ఎస్సి,ఎస్టి, మైనారిటీ సంఘాల నాయకులు కార్యకర్తలు చట్టసభలలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై సంఘటితంగా పోరాడాలని,సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలలో భాగస్వాములు కావాలని జనతంత్ర శ్రామిక రాజ్యాధికార సంఘం సకల బిసి,ఎస్సి,ఎస్టీ మైనార్టీ పేదలకు విజ్ఞప్తి చేస్తుంది.

మహిళా రిజర్వేషన్లలో ఓబిసి మహిళలకి జనాభా దామాషా ప్రకారం కోటా కల్పించాలని,చట్ట సభల్లో ఓబిసిలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో తక్షణమే ప్రవేశపెట్టి,ఆమోదింపచేసి, 2024 సాధారణ ఎన్నికల్లోనే అమలు జరపాలని,సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించి,రిజర్వేషన్ల ఫలితాలు అన్ని కులాలకూ అందే విధంగా వర్గీకరించాలని,ప్రస్తుత జాతీయ జనగణనలో భాగంగానే ఓబిసిల జనగణన కులాల వారీగా సేకరించాలని డిమాండ్ చేశారు.

కన్న కూతురి విషయంలో షాకింగ్ నిజం తెలుసుకున్న వియత్నామీస్ తండ్రి.. చివరికి?