సింగపూర్: ట్రావెల్ ఏజెంట్‌ పేరిట మోసం.. జనానికి భారీగా టోకరా, భారత సంతతి మహిళకు జైలు శిక్ష

టూర్ ప్యాకేజీల పేరిట మోసానికి పాల్పడిన 55 ఏళ్ల భారత సంతతి మహిళకు సింగపూర్ కోర్ట్ మంగళవారం 20 వారాల జైలు శిక్ష విధించింది.

ఒక దశాబ్ధం పాటు ఫ్రీలాన్స్ ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేయడానికి అవసరమైన లైసెన్స్ లేకుండానే విధులు నిర్వర్తించిన ఎస్ లీలావాడి అనే మహిళ.

భారత్, దుబాయ్‌ల మధ్య టూర్ ప్యాకేజ్‌లు నడుపుతున్నట్లు చెప్పి 8 మందిని మోసం చేసింది.

ఈ క్రమంలో సింగపూర్ టూరిజం బోర్డ్ నుంచి లైసెన్స్ లేకుండా ట్రావెల్ ఏజెంట్‌గా వ్యవహరించినట్లు లీలావాడి నేరాన్ని అంగీకరించింది.

ఇదే కేసులో 7 అభియోగాలను సైతం కోర్టు పరిగణనలోనికి తీసుకుని జైలు శిక్ష విధించింది.

అయితే కోర్ట్ తీర్పుపై లీలావాడి అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఈ శిక్షను వెంటనే అమలు చేయడం లేదు.

2000లో ఆమె ఫ్రీలాన్స్ ఏజెంట్‌గా పనిచేయడం ప్రారంభించిందని, 2004లో లైసెన్స్ పొందిన ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగంలో చేరిన తర్వాత కొన్ని నెలలు పనిచేయలేదని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.

ఇక దుబాయ్, ఇండియాల మధ్య టూర్ ప్యాకేజీలు వున్నట్లు జనాన్ని నమ్మించిన లీలావాడి ఒక్కొక్కరి నుంచి డిపాజిట్‌గా 500 సింగపూర్ డాలర్లను వసూలు చేసింది.

దీనిని బుకింగ్‌లు చేయడానికి ఉపయోగిస్తానని నమ్మించింది.నగదు రూపంలో కానీ, తన తల్లి బ్యాంక్ ఖాతాకు కానీ చెల్లింపులు చేయాలని ఆమె బాధితులను కోరింది.

ఇక ప్రయాణ తేదీలకు కొద్ది నెలల ముందు నుంచి మిగిలిన మొత్తం చెల్లించాలని లీలావాడి ప్రయాణీకులపై ఒత్తిడి తెచ్చేది.

వారికి ప్రయాణ ప్రణాళికలు పంపడంతో పాటు బీమా, కరెన్సీ మార్పిడి వంటి వాటిపై సలహాలు ఇస్తానని చెప్పేది.

తీరా ప్రయణ తేదీలు దగ్గరపడినప్పుడు తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో వుందని అబద్ధం చెప్పి కస్టమర్ల చేతే ప్రయాణాన్ని వాయిదా వేయించేది.

ఈ విధంగా 2013 నుంచి 2017 మధ్య కాలంలో ఎనిమిది మంది నుంచి 34,590 సింగపూర్ డాలర్లను వసూలు చేసింది లీలా వాడి.

తాజా కేసులో క్రిమినల్ ఆరోపణలపై ఆమెకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ పడే అవకాశం వంది.

ఇక లైసెన్స్ లేని ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేసినందుకు లీలావాడికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా పది వేల సింగపూర్ డాలర్ల జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

తెలంగాణలో మోగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్‌