థర్డ్ వేవ్ ముప్పు: లాక్‌డౌన్ ఎత్తివేతపై ఆలోచించండి.. యూకే ప్రధానికి భారత సంతతి శాస్త్రవేత్త హెచ్చరిక
TeluguStop.com
కరోనా మహమ్మారి వల్ల అష్టకష్టాలు పడిన దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, మరణాలతో యూకే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
ఆ తర్వాత వైరస్ వ్యాప్తి నెమ్మదించడంతో ఊపిరి పీల్చుకుంది.కానీ తిరిగి డిసెంబర్, జనవరి నెలల్లో సెకండ్ వేవ్ విజృంభించడంతో పాటు కొత్త రకం స్ట్రెయిన్‌తో బ్రిటన్ వణికిపోయింది.
కొత్త రకం కోవిడ్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని యూకే ప్రభుత్వం గుర్తించింది.
నవంబరులో మూడోసారి నాలుగు వారాల లాక్‌డౌన్ విధించిన బ్రిటన్.డిసెంబరు మొదటి వారంలో ఆంక్షలు సడలించింది.
కానీ, పరిస్థితి అదుపుతప్పుతుందని భావించి మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు.ఇదే సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేసింది.
దీనితో పాటు వ్యాక్సినేషన్‌కు పెద్ద పీట వేసింది.దీని వల్లే కోవిడ్ వెలుగు చూసిన తర్వాత తొలిసారిగా జీరో మరణాలు నమోదయ్యాయి.
స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లలో కూడా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని ఫోర్బ్స్ పత్రిక ఇటీవల పేర్కొంది.
ఈ నేపథ్యంలో జూన్ 21 నుంచి పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
అయితే ఆంక్షలు ఎత్తివేసిన పక్షంలో థర్డ్ వేవ్ ముంచుకురావొచ్చని భారత సంతతి శాస్త్రవేత్త రవి గుప్తా హెచ్చరించారు.
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారుగా గుప్తా వ్యవహరిస్తున్నారు.జూన్ 21 నుంచి అన్ని ఆంక్షలను ఎత్తివేయకుండా జాప్యం చేయాలనీ ఆయన ప్రభుత్వానికి సూచించారు.
దేశంలో గడిచిన వారం రోజులుగా రోజుకు 3 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని రవిగుప్తా వెల్లడించారు.
ప్రస్తుతానికి కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరగవచ్చని ఆయన హెచ్చరించారు.
ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సంకేతంగా భావించాల్సి వుంటుందని రవిగుప్తా పేర్కొన్నారు. """/"/
అయితే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం కావడం.
సగానికిపైగా వ్యాక్సిన్ వేయించుకున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ ఆలస్యంగానైనా తలెత్తవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
జూన్ 21న అన్‌లాక్ ప్రక్రియను మొదలు పెట్టేలోగా ఇంటెలిజెన్స్ నివేదికను తెప్పించుకోవాలని, నిపుణుల సూచనలను పాటించాలని రవిగుప్తా ప్రభుత్వానికి సూచించారు.
ఇదే సమయంలో యూకే పర్యావరణ శాఖ మంత్రి జార్జి యాస్తిస్ , మరికొందరు నిపుణులు సైతం రవి గుప్తా వాదనతో ఏకీభవించారు.
మరి దీనిపై ప్రధాని బోరిస్ జాన్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
చర్మం నలుపును తగ్గించే మార్గాలివి.. అస్సలు మిస్ అవ్వకండి!