ప్రాణం కోసం : ముగ్గురు భారతీయులను చంపిన ఇండియన్, నిర్దోషేనన్న యూకే కోర్టు

తూర్పు లండన్‌లో ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘర్షణలో ముగ్గురు భారతీయ సిక్కులు మరణించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనకు కారణంగా భావిస్తున్న భారత సంతతికి చెందిన బిల్డర్‌పై ఎలాంటి హత్యానేరం నమోదు చేయరాదని కోర్టు ఆదేశించింది.

దీని వెనుక గల కారణాల్లోకి వెళితే.నరీందర్ సింగ్ లుభాయా (29) హరీందర్ కుమార్ (30), మల్కిత్ సింగ్ ధిల్లాన్‌లను దారుణంగా హత్య చేసిన నేరంపై గుర్జీత్ సింగ్ (29)ను మెట్రోపాలిటిన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హత్యకు గురైన ముగ్గురు వ్యక్తులు.పంజాబ్‌కు చెందిన వారే.

వీరు లండన్‌ రెడ్‌బ్రిడ్జ్ ఏరియాలోని సెవెన్ కింగ్స్ వద్ద గుర్జీత్ సింగ్‌పై దాడికి పాల్పడ్డారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ ముగ్గురు శవాలుగా తేలారు.ఈ ఘటనపై గుర్జీత్‌సింగ్‌ను అనుమానించిన పోలీసులు ఈ ఏడాది జనవరి 20న అరెస్ట్ చేశారు.

అతనిపై బహిరంగ ప్రదేశంలో మారణాయుధంతో సంచరించాడన్న అభియోగాలు నమోదు చేశారు.ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 19న స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్టులో విచారణకు హాజరుపరిచారు.

అయితే జ్యూరీ గుర్జీత్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది.ఘటన జరిగిన రోజు మృతులు తనపై దాడికి దిగడంతో గుర్జీత్ ఆత్మరక్షణ కోసం వారితో పోరాడినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది.

వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే గుర్జీత్‌పై ఆ ముగ్గురు దాడి చేసినట్లు కోర్టు దృష్టికి వచ్చింది.

ఈ ఘటనకు ముందు రోజు రాత్రి ఓ బర్త్‌డే వేడుక జరిగింది.అక్కడ కొందరి మధ్య వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది.

ఇక ఘర్షణ జరిగిన రోజు రాత్రి స్థానికంగా ఉన్న గురుద్వారాలోకి గుర్జీత్ వెళ్లాడు.

అప్పటికే పలువురు మారణాయుధాలతో అక్కడ కాపుకాశారు.గుర్జీత్ గురుద్వారా నుంచి బయటకు వచ్చి రావడంతోనే అతనిపై నలుగురు దుండగులు దాడికి దిగారు.

వీరిలో ముగ్గురు ఆ తర్వాత రక్తమడుగులో శవాలుగా కనిపించారు.కాగా ఈ నలుగురి దాడిలో గుర్జీత్ సింగ్ తీవ్రగాయాల పాలయ్యాడు.

తల, నుదురు భాగాల్లో కత్తిపోట్లతో పాటు నిందితులు అతని తల పై సుత్తితో మోదినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు.

ఈ నలుగురిలో మిగిలిన వ్యక్తి తూర్పు లండన్‌లోని రోమ్‌ఫోర్డ్‌ చెందిన 29 ఏళ్ల సందీప్‌ సింగ్.

అతనిని దోషిగా తేల్చిన కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.అంతేకాకుండా సందీప్ తన వీసా గడువు ముగిసినా అక్రమంగా యూకేలో ఉంటున్నాడని శిక్షాకాలం ముగిసిన తర్వాత అతనిని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా ఆదేశించింది.

మరోవైపు ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.లండన్ మేయర్ సాదిక్ ఖాన్ జనవరిలో కత్తిపోట్లు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

నగరంలో ఈ తరహా ఘటనలు నివారించడానికి ప్రభుత్వ సాయం కోరారు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?