భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ భారీ వర్షాలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ,జిల్లాలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినందున అధికారులంతా అప్రమత్తతో, అందుబాటులో వుండాలని ఆదేశించారు.

మున్సిపల్, పంచాయితి రాజ్ అధికారులు గ్రామ పరిధిలో పురాతన, శిథిల భవనాలు, గోడలు కూలే పరిస్థితులు ఉన్నట్లైతే,వాటిని గుర్తించి నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు.

జిల్లాలోని మానేరు, మూల వాగు, నక్క వాగు, ఇతర వాగుల్లోనీ ప్రజలు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేయాలన్నారు.

జిల్లాలో ఉన్న చెరువులు, వివిధ ప్రాజేక్టుల కాల్వలు నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెరువులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు వంకల వద్ద మత్తడి పొంగిపోర్లె ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు 24 గంటలు పర్యవేక్షణ చేయాలనీ ఆదేశిచారు.

జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపిఒ భారీ వర్షాల నేపథ్యంలో హెడ్ క్వార్టర్ లో ఉండి సమన్వయంతో పనులు చేయాలనీ, అందుబాటులో ఉండాలని అన్నారు.

ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసేందుకు ప్రతి గ్రామ పరిధిలో వాట్సాప్ గ్రూపుల్లో తహసిల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ ఫోన్ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.

అత్యవసర సహాయం కోరుతూ వచ్చే ఫోన్ కాల్ లకు తక్షణ మే స్పందించాలన్నారు.

గ్రామాల్లోని లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నీటి ప్రవహం అధికమై నట్లయితే దారులను మూసివేసి బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.

జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని, విద్యుత్ వైర్లు తెగి పడిపోయి నట్లయితే వెంటనే మరమత్తులు చేయాలని ఆదేశించారు.

భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రజలను తరలించేందుకు సమీపంలో క్యాంపులు ఏర్పాటు చేసేందుకు వీలుగా సంసిద్దంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి, జంతు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

పరిస్థితి మెరుగు పడేవరకు చెరువుల, వాగుల వద్ద చేపలు పట్టడానికి, స్నానాలకు అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజలు ఆపద సమయంలో సహాయక చర్యల నిమిత్తం సంబంధిత ప్రాంత తహసిల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ లకు ఫోన్ చేయాలనీ సూచించారు.

వర్షాకాలం దృష్ట్యా అన్ని గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలన్నారు.

కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు టి శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్లు, తహాసిల్దారులు జిల్లా పంచాయతీ అధికారి, తదితరులు పాల్గొన్నారు.

వచ్చే నెలలో అమెరికాకు నరేంద్రమోడీ మోడీ.. ప్రవాస భారతీయులతో మెగా ఈవెంట్‌కు ఏర్పాట్లు