ఆ విధంగా బీజేపీ కి తిరుగే లేదు ...వీరు మద్దతు ఇవ్వక తప్పడం లేదు
TeluguStop.com
జాతీయస్థాయిలో బిజెపి హవా కొనసాగుతోంది.రెండు సార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి మూడోసారి హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతోంది.
జాతీయస్థాయిలో బిజెపికి గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ లేకపోవడం, ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం వంటి కారణాలతో బిజెపి హవా కొనసాగుతోంది.
బిజెపికి అవసరమైన సందర్భాల్లో మద్దతు పలకాల్సిన పరిస్థితి , దుస్థితి ప్రాంతీయ పార్టీలకు ఏర్పడింది.
ఇదే బిజెపి హవాకు తిరుగులేకుండా చేసేందుకు కారణం అవుతోంది.దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు, ఆర్థికమాంద్యం ఇవన్నీ బిజెపిపై జనాల్లో ఆగ్రహం పెరిగేలా చేస్తున్నా, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించడం లేదు.
ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోట కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు.
ఇక ఏపీ విషయానికి వస్తే.ఆంధ్ర , తెలంగాణ విభజన తర్వాత ఏపీకి బిజెపి పెద్దగా వరాలు ఇచ్చింది లేదు.
రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ప్రభావం ఏపీలో ఏమాత్రం లేదు.అదే బిజెపికి కలిసి వస్తుంది.
ఏపీలో బిజెపి ప్రభావం అంతంత మాత్రమే.క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి సరైన నాయకులు, కార్యకర్తలు లేరు.
అయినా కేంద్రంలో తీసుకుంటున్న నిర్ణయాలను గట్టిగా ప్రశ్నించే స్థాయిలో ఎక్కడా అధికార పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షం కానీ లేవు.
ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి కేంద్రంలో తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు మద్దతు పలుకుతోంది.
అవసరమైన సందర్భాల్లో బిజెపికి అండగా నిలబడుతోంది.ఏపీ బీజేపీ నాయకులు వైసిపిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేసినా, ఆ విమర్శలను పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ.
తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రానికి మద్దతు పలుకుతూ, ఆ పార్టీ అగ్ర నేతల అనుగ్రహం కోసం చూడాల్సిన పరిస్థితి.
"""/"/
ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పరిస్థితి దాదాపు ఇదే.జాతీయ స్థాయిలో బిజెపికి పోటీ ఇచ్చే స్థాయిలో ఏ పార్టీ లేకపోవడంతో రాబోయే ఎన్నికల్లోను కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఇటు టిడిపి అటు వైసిపిలు ఉన్నాయి.
ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంటుంది కనుక తమకు ముందు ముందు ఇబ్బందులు రాకుండా ముందుగానే బిజెపి ప్రభుత్వం కోసం ఏపీలోని అన్ని పార్టీలు ప్రయత్నిస్తుండడం తదితర వ్యవహారాల కారణంగానే బిజెపికి ఏపీలో బలం లేకపోయినా పెత్తనం కొనసాగిస్తోంది.