అక్షయ తృతీయ రోజు ఈ పనులు చేయడం అస్సలు మర్చిపోవద్దు?
TeluguStop.com
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్షయ తృతీయ ఒక పండుగలా నిర్వహించుకుంటారు.అక్షయ తృతీయ రోజును ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
త్రేతాయుగం ప్రారంభమైనది అక్షయ తృతీయ రోజేనని, పరశురాముడు జన్మించినది అక్షయతృతీయ రోజేనని, కుబేరుడు సంపదకు అధిపతి అయిన అది కూడా అక్షయ తృతీయ రోజేనని, సింహాచలంలో లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం కూడా అక్షయ తృతీయ రోజు జరిగిందని నమ్ముతారు.
కనుక ఈ అక్షయ తృతీయను ఒక పండుగలా జరుపుకుంటారు.ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజు పెద్ద ఎత్తున లక్ష్మీదేవి కుబేరుడికి పూజలు నిర్వహిస్తారు.
మరి అక్షయ తృతీయ రోజు ఏ విధంగా పూజ చేయాలి? ఎటువంటి పనులను చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
అక్షయ తృతీయ రోజు ఉదయమే లేచి స్నానమాచరించి ఇంటిని శుభ్రపరచుకోవాలి.లక్ష్మీదేవికి కుబేరుడికి అక్షయ తృతీయ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
లక్ష్మీదేవికి కుడివైపున కుబేరుడిని ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరం చదివి పూజ చేయాలి.
పూజ అనంతరం అక్షింతలను తలపై వేసుకొని మన స్తోమతకు తగ్గట్టుగా దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తారు.
చాలామంది అక్షయ తృతీయ రోజు వైశాఖ పూజ కూడా చేస్తారు.ఎక్కువగా ఈ అక్షయ తృతీయ రోజు వేసవి తాపం ఉండటం వల్ల చాలామంది మజ్జిగ, చెప్పులు, గొడుగు వంటి వస్తువులను దానం చేస్తారు.
మరికొందరు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం వల్ల అక్షయంగా ఉంటుందని భావిస్తారు.
అక్షయం అంటే తరిగిపోకుండా అని అర్థం.అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనేవారు అప్పు చేసి కొనకూడదు.
అదేవిధంగా ఇంతటి పవిత్రమైన రోజున పితృదేవతలకు తర్పణం చేయటం వల్ల వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.
ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజు యజ్ఞాలు, హోమాలు, జపాలు చేయడం వల్ల అక్షయమైన ఫలితాలను అందిస్తాయి.