యథేచ్ఛగా అక్రమార్కుల అక్రమ మట్టి దందా…!

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల కేంద్రంలో అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతుంది.

దీంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలం పరిధిలోని మంగపురం గ్రామ శివారు భూములలో ఈ అక్రమ దందా నిత్యం కొనసాగుతుందని,మైనింగ్,రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని అంటున్నారు.

సొంత పట్టా కలిగిన భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి అనుమతులు తీసుకోవలసి ఉంటుంది.

కానీ,వాటిని బేఖాతర్ చేస్తూ మట్టి దందాకు అలవాటుపడిన కొంతమంది అక్రమార్కులు యథేచ్ఛగా ఎర్రమట్టిని విచ్చలవిడిగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

అక్రమార్కులు రెచ్చిపోతూ ఎక్స్‌కవేటర్లతో మట్టిని ఇష్టానుసారంగా తోడేస్తూ, పదుల సంఖ్యలో ట్రిప్పర్లతో మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నా ఎవరికీ పట్టకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

టిప్పర్ల నుండి వస్తున్న దుమ్ము, ధూళితో ఊపిరితిత్తుల, శ్వాసకోస వ్యాధులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మట్టి అక్రమ తరలింపుపై ప్రజలు, రైతులు అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్స్‌కవేటర్‌ సాయంతో టిప్పర్లతో మట్టిని మిర్యాలగూడకు తరలిస్తున్నారని,అధికారుల అండదండలతోనే ఈ తతంగం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు రెవెన్యూ,మైనింగ్ అధికారులు నిద్ర మత్తును వీడి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న ఎగిరే కారు.. ఇండియన్ రోడ్ల కోసమే తయారు చేశారట..?