నిల్వనీడలేని నిరుపేదలకు ఇంటి స్థలాలతో పాటు ఇళ్లు ఇవ్వాలి:నూనె వెంకటస్వామి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:నకిరేకల్ మండలంలో అనేక గ్రామాల్లో నిలువ నీడలేని నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు పంపిణీ చేసి,అందులో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు.
నకిరేకల్ మండలం నోముల గ్రామంలో ఇళ్ల స్థలాలు,ఇళ్లు లేని నిరుపేదల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 50 ఏళ్ల క్రితం ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఓసి లలోని నిరుపేదలకు ఆనాటి ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి,ఇళ్లు కూడా నిర్మించిందని,ఒక్కో కుటుంబం ఈ 50 ఏళ్లలో మూడు, నాలుగు కుటుంబాలుగా మారాయని,అందరూ ఒకే ఇంటిలో నివసించే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిలువ నీడలేని నిరుపేదలకు ధనిక వర్గాలు ఆక్రమించిన ప్రభుత్వ భూములను పేదల ఇండ్ల స్థలాలకు కేటాయించి,ప్రభుత్వ భూమి లేని దగ్గర కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి,పేదలపై సర్కార్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్యార సాలయ్య,మాచర్ల ఎల్లయ్య, వీరయ్య,మామిడి భిక్షం, మాచర్ల గోపి,మాచర్ల రమేష్, ఎర్ర ప్రమీల తదితరులు పాల్గొన్నారు.