ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతర్…!

నల్లగొండ జిల్లా: పాలకులు మారిన ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం మాత్రం యధేచ్చగా కొనసాగుతుంది.

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేట (తీదేడు) గ్రామ శివారులో రాజ్యనాయక్ తండా- తిరుమలాపురం దారిలో శ్రీ వెంకటేశ్వర కాటన్ మిల్లు సమీపంలో సర్వే నెంబర్ 389 లో 39 ఎకరాల 26 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో సుమారు 13 ఎకరాల 10 గుంటల భూమిని కొందరు లావన్య పట్టా కలిగి ఉన్నారని సమాచారం.

మిగిలిన 26 ఎకరాల 16 గుంటల భూమి ప్రభుత్వ అధీనంలో ఉన్నదని,దానిలో ఉన్న గుట్టను కొందరు అక్రమంగా ఆక్రమించి చదును చేసి సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఏకంగా 50 ఫిట్ల రోడ్డు నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గతంలో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడితే అప్పటి తహశీల్దార్ విశాలాక్షి దృష్టికి కొందరు విలేకరులు తీసుకెళ్లగా అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకొన్నట్లు చెబుతున్నారు.

ఆ తర్వాత ఆ భూమిని కాపాడేందుకు చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలకు,కబ్జాలకు తావులేదని సూచిస్తూ హెచ్చరిక బోర్డను ఏర్పాటు చేశారని,రెవిన్యూ అధికారుల ఆదేశాలను అతిక్రమిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

దాంతో సదరు అక్రమార్కులు కొంత కాలం పాటు సైలెంట్ గా ఉండి, మళ్ళీ తమ పనులు పూర్తి చేశారని అంటున్నారు.

రెవిన్యూ అధికారుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును సైతం పీకేసి ఎంచక్కా రోడ్డు నిర్మాణం చేసినట్లు కనిపిస్తుంది.

రెవిన్యూ అధికారుల హెచ్చరికలను లెక్కచేయకుండా ప్రభుత్వ భూమిని చదును చేసి ఏకంగా 2 ఎకరాల విస్తీర్ణంలో 50 ఫిట్ల రోడ్డును నిర్మిస్తుంటే రెవిన్యూ శాఖ చోద్యం చూస్తూ ఉండటంపై మండల ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలువెల్లువెత్తున్నాయి.

ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

దీనిపై చింతపల్లి తహశీల్దార్ మహమ్మద్ శంషుద్దీన్ ను వివరణ కోరగా మండలంలోని వెంకటంపేట(తీదేడు) గ్రామ శివారులోని సర్వే నెంబర్ 389 ప్రభుత్వ భూమిలో అక్రమంగా రోడ్డు వేసిన విషయం ఇంకా తమ దృష్టికి రాలేదని, దానిపై తగు విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.

అనిరుధ్ ప్రాణం పెట్టి దేవర కోసం పని చేశాడా… ఆ బీజీఎంకు గూస్ బంప్స్ అంటూ?