కొండకోనల్లో ఐదు దొనల్ తండా అవస్థలు పడుతున్న గిరి”జనం”

యాదాద్రి భువనగిరి జిల్లా:గత కొన్నేళ్ల క్రితం అసలు అక్కడొక ఊరు ఉందనే విషయం చాలా మందికి తెలియదు.

ప్రకృతి వడిలో పచ్చగా పరచుకున్న చెట్లు,ఆకాశంలా పరుచుకున్న గుట్టల నడుమ వందల ఏళ్ల క్రితం ఏర్పడిన గిరిజనగూడెం.

చాలా ఏళ్లుగా నాగరిక ప్రపంచానికి దూరంగా ఎలాంటి ఆధునిక సౌకర్యాలు లేకుండా కొండకోనల్లో ఆటవికంగా బ్రతికిన గిరిజనం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో రాచకొండ చిట్టచివరి ప్రాంతంగా అనేక వింతలు విశేషాలకు నెలవై కొలువైన తండా.

ఈ ప్రాంతంలో గుట్టలపై ఐదు పెద్ద పెద్ద దొనలు ఉండడంతో దీనికి ఐదు దొనల తండా పేరొచ్చింది.

గతంలో ఇక్కడ నుండి రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది కాదు.విద్యా,వైద్యం ఉండేది కాదు.

తినడానికి తిండి,తాగడానికి నీళ్ళు కూడా దొరికేవి కావు.ఏదైనా అనారోగ్య సమస్య వస్తే పట్నానికి వెళ్ళాలంటే నానా అవస్థలు పడేవారు.

నిత్యం సమస్యలతో సహవాసం చేసే తండావాసులు ఇప్పుడిప్పుడే కొన్ని సమస్యల నుండి బయటపడి కాస్త మెరుగైన జీవనం కొనసాగిస్తున్నారు.

కొంతవరకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడంతో ఆ గ్రామానికి వెళ్ళే అవకాశం కలిగింది.

ఈ తండా చుట్టూరా సహజసిద్ధమైన ప్రకృతి అందాలు ఆరబోసినట్లుగా ఉంటాయి.ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు గుట్టలపై ఐదు దొనలు ఏర్పాటు చేసుకొని,అందులో ఎప్పుడూ నీళ్ళు నిల్వ ఉండేలా చేసి,నీరు త్రాగడానికి వచ్చే జంతువులను టార్గెట్ చేసి వేటాడేవాడని గిరిజనులు చెప్పుకుంటారు.

కాలక్రమేణా రాజుల పాలన అంతమవడంతో గిరిజనుల కేంద్ర స్థానంగా మారింది.50 పైచిలుకు ఇళ్లు,200 మంది జనాభాతో ఐదు దొనల తండాగా ఖ్యాతికెక్కింది.

ఇక్కడి గిరిజనులు వర్షాలు పడే సమయంలో ఆ దొనలను శుభ్రం చేసి,ప్రత్యేక పూజలతో మొక్కులను తీర్చుకొని వర్షాలు కురవాలని వేడుకుంటారు.

ఇప్పటికీ ఏది కావాలన్నా కుటుంబం గడవాలన్నా మండల కేంద్రానికి లేదా పక్కనున్న ఆరుట్లకు వెళ్ళవలసిన పరిస్థితి.

ఇప్పుడిప్పుడే ఒక్కటిగా సౌకర్యాలు చవిచూస్తున్నారు.వీరికి ఒక పాఠశాల కూడా ఏర్పాటు చేశారు.

అందులో పది మంది పిల్లలున్నా సరే పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులు పట్నం నుండి వచ్చి,ఈ తండాలో విద్యను బోధించడం మాకు ధైర్యంగా ఉందని గొప్పగా చెప్పుకుంటారు.

వీరి ద్వారా తండా సమస్యలపై ఆరా తీస్తే రోడ్డు మార్గం లేక విద్య, వైద్యం,బస్సు,ఇతర సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారని,ఏ చిన్న పనికైనా మండల కేంద్రానికి వెళ్లాలంటే కాలినడన లేదా కొంతమంది ద్విచక్ర వాహనంపై వెళ్లవలసి వస్తుందని, పైచదువుల కోసం పట్నం వెళ్లాలన్నా బస్సు సౌకర్యం లేక కాలినడకన సగం దూరం వెళ్లి అక్కడి నుండి బస్సులో ప్రయాణం కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

ఎలక్షన్ల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు అనేక వాగ్దానాలు చేసి తర్వాత ముఖం చాటేస్తున్నారని,నియోజకవర్గ ఎమ్మెల్యే ఒకసారి మాతండాకు వచ్చి మా పరిస్థితి చూడాలని తండా వాసులు వేడుకుంటున్నారు.

వైరల్ వీడియో : స్టేజిపై స్టెప్పులతో అదరగొట్టిన ఒలంపిక్ పతక విజేత..