న్యాయ వ్యవస్ధను గౌరవించని ప్రభుత్వ వ్యవస్థను అడ్డుకోవాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారం లోగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఢిల్లీలో రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ.ఇప్పటికైనా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని కోరారు.
కోర్టు తీర్పు మేరకు రమేష్ కుమార్ ను నియమిస్తే తప్పేంటని ప్రశ్నించారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైనదని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
న్యాయ వ్యవస్థకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని అన్నారు.
మనది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజస్వామ్య దేశమని., న్యాయ వ్యవస్థలను గౌరవిద్దామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడమే తన తప్పైపోయిందని అన్నారు.22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం, రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి వచ్చి వేడుకున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య బద్ధంగా భారీ మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వం మనదని.పక్కనున్న వారి మాటలు విని సీఎం జగన్ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతు నొక్కేస్తారా అంటూ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.