నెల రోజుల దాటినా అన్నదాతకు తప్పని తిప్పలు…!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్నదాతల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు.

వరి ధాన్యం కళ్ళాల్లోకి వచ్చి నెల దాటినా ధాన్యం కొనుగోళ్ళ వ్యవహారం కొలిక్కి రాకపోగా, తంటాలు పడి కాంటాలు వేసిన ధాన్యం సరైన రీతిలో ఎగుమతి చేయక,అకాల వర్షాలతో బస్తాలలోని ధాన్యం మొలకెత్తి రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు.

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కళ్ళ ముందే నీళ్లలో తడిసి మొలకెత్తుతుంటే అమ్ముకోలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ధాన్యం కొనుగోలు, ఎగుమతులలో జాప్యంతో వరుస అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోతూ రైతులు నష్టపోతున్నారు.

ఐకేపీ,పిఏసీఎస్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు తరలించడానికి లారీలు రాకపోవడంతో నెలల తరబడి ధాన్యం రాసులు కేంద్రాల్లోనే ఉంటూ వర్షాలకు తడిసిపోగా ధాన్యం మొలకెత్తుతుంది.

ఆకస్మాత్తుగా పడుతున్న స్వల్ప,భారీ వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

పండిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్న అధికారులు,పాలకుల హామీలు అమలుకు నోచుకోవడం లేదు.

త్రిపురారం మండలం లచ్యతండ గ్రామ పంచాయతీలో నెల రోజులకు పైగా ధాన్యం అమ్మకానికి వచ్చి ఐకేపీ కేంద్రంలో రాసులుగా పడివున్నా చూసే దిక్కు లేదు.

దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ఆకాశం వైపు చూస్తు అధికారులపై దుమ్మేత్తి పోస్తున్నారు.

లచ్యతండాలో ఐకెపి కేంద్రంలో 15,000 బస్తాల ధాన్యం రాసులు ఉండగా, కాంటా వేసిన 2000 బస్తాలు తరలించడానికి లారీలు రాక కేంద్రంలోనే ఉన్నాయి.

కాంటాలు వేసిన బస్తాల్లోని ధాన్యం గత మూడు రోజుల క్రితం తడవడంతో మొలకలు వచ్చాయి.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ధాన్యం కాంటాలు వేసి,ఎగుమతిపై దృష్టి సారించి ధాన్యం తరలించే ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.

లేనిపక్షంలో భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని,ఒక వైపు ప్రకృతి,మరోవైపు ప్రభుత్వం రైతులపై పగ పట్టాయా అంటూ వాపోతున్నారు.

కల్కి మూవీలో కృష్ణుడి పాత్రను పోషించింది ఇతనే.. ఆ తమిళ నటుడికి ఛాన్స్ దక్కిందా?