మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ శాఖ…?

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మద్య నిషేధ మరియు అబ్కారి శాఖ అధికారులు పూర్తిగా మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు మద్యం వ్యాపారంలో జరిగే తీరును చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

అబ్కారీ శాఖ అన్నదే మద్యాన్ని నిషేధించడానికి అని చాలా మందికి తెలియదు.కానీ, ప్రభుత్వ మద్యం పాలసీ ద్వారా మద్యం విక్రయాలను పెంచే శాఖగా అబ్కారీ శాఖ మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇదే అదునుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అబ్కారీ శాఖ అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తూ పైసా వసూల్ అంటూ భారీగా ఆదాయం పెంచుకుంటూ కోట్లకు పడగెత్తుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నెల వారీగా భారీ మొత్తంలో జీతం తీసుకొనే ఎక్సైజ్ శాఖ అధికారులు జీతం కంటే మామూళ్ల పైనే ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది.

మద్యం విక్రయాలను బంగారు బాతుగా భావిస్తున్న అబ్కారీ శాఖ అధికారులు వైన్స్‌ డీలర్లు చెప్పిందే వేదంగా సెలెక్టెడ్ వైన్స్ కు మాత్రమే డిమాండ్ ఉన్న మద్యం సరఫరా చేస్తూ, మద్యం సిండికేట్లను ప్రోత్సహిస్తూ మద్యం వ్యాపారం అంతా బెల్ట్‌షాపుల ద్వారానే సాగేలా తనవంతు పాత్ర పోషిస్తున్నారనేది బహిరంగ రహస్యమే అంటున్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన అధికారులు ఎక్సైజ్‌ చట్టాలను తుంగలో తొక్కి అందుకు ప్రతిఫలంగా మామూళ్లు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారనే చర్చ జరుగుతుంది.

వసూళ్లైన మొత్తం కిందిస్థాయి నుంచి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వరకు ప్రతి నెలా పంపకాలు జరుగుతాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల ఎక్సైజ్ శాఖలో వసూలు రాజాలు మద్యం వ్యాపారులను పీల్చి పిప్పి చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.

ఏ వ్యాపారిని అడిగినా అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులే ఏకరువు పెట్టడం గమనార్హం.

వైన్స్ యాజమాన్యం ఇబ్బందులు అధికారులకు అవసరం లేదని,అడిగింది ఇవ్వకపోతే ఇకవారికి తిప్పలు తప్పవని, అందుకే అడిగినంత ముట్టజెప్పి పంపిస్తారని సమాచారం.

వైన్స్ లో దొరకని బ్రాండ్‌ మద్యం బెల్ట్‌షాపుల్లో దొరకడం దేనికి సంకేతమని అంటున్నారు.

అబ్కారీ శాఖ అధికారుల.పుణ్యమాని వైన్స్ లో దొరకని బ్రాండ్ మద్యం పల్లెల్లోని బెల్ట్‌షాపుల్లో దొరకడం ఈ మొత్తం అక్రమ సిండికేట్ దందాకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

బెల్ట్ షాపుతో మారుమూల పల్లెలు మత్తులో జోగుతున్నాయి.గ్రామాలు, తండాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌ దుకాణాలు వెలుస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.అనేక మంది బెల్ట్‌ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.

అప్పులు చేసి తాగడంతో కాపురాలు వీధి పాలవుతున్నాయి.మందు బాబులు కోరుకునే బ్రాండ్లను వైన్స్‌ నిర్వాహకు లు తెలివిగా బెల్ట్‌షాపులకు మళ్లిస్తూ డిమాండ్‌లేని బ్రాండ్లను వైన్స్‌లలో విక్రయిస్తూ రెండువైపులా ఆర్జిస్తున్నారు.

డిమాండ్‌ లేని బ్రాండ్‌ విక్రయించి కంపెనీ సేల్స్‌మెన్ల నుంచి అదనంగా లబ్ధి పొందుతున్నారు.

మరోవైపు డిమాండ్‌ ఉన్న సరుకునే బెల్ట్‌షాపులకు వేసి ప్రతి క్వార్టర్‌పైన ఎమ్మార్పీకి అదనంగా రూ.

20 వసూళ్లు చేస్తున్నారు.ఇక బెల్ట్‌షాపు నిర్వాహకులు ప్రతి క్వార్టర్‌పైన రూ.

20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

ఎమ్మార్పీపై వైన్స్‌ డీలర్లు అదనంగా రూ.15 బాదుతుండగా బెల్ట్‌షాపు నిర్వాహకులు మరో రూ.

30 అదనపు భారం మోపుతున్నారు.మొత్తంగా ఒక క్వార్టర్‌ బాటిల్‌పై మద్యం ప్రియులు రూ.

30 నుంచి రూ.40 వరకు చెల్లించుకుంటున్నారు.

ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు అదనంగా మద్యం ప్రియుల నుంచి డీలర్లు,బెల్ట్‌షాపుల నిర్వాహకులు పిండేస్తున్నారు.

ఇదిలా ఉంటే డీలర్లు, బెల్ట్‌షాపుల నిర్వాహకులు తమ దందా యథేచ్ఛగా సాగేందుకు ప్రతీనెలా ఎక్సైజ్‌ సర్కిల్‌కు వారి పరిధిలోని మద్యం దుకాణాల నుంచి రూ.

లక్ష, ప్రతీ పోలీస్ స్టేషన్‌కు ఒక్కో వైన్స్‌ నుంచి రూ.25 వేలు మామూళ్ల రూపంలో ముట్టజెప్పుతున్నారనే జరుగుతున్న చర్చ.

ఇంత పెద్ద మొత్తం చెల్లించడం వెనుక పెద్ద రాకెట్‌ నడుస్తోందని,ప్రతీనెలా అందాల్సిన మొత్తం సకాలంలో రాకపోతే పోలీస్‌ అధికారులు వైన్‌షాపునకు 70 అడుగుల దూరంలోనే డ్రంకెన్‌డ్రైవ్‌ నిర్వహిస్తారు.

మద్యం ప్రియులు చేసే డిమాండ్లన్నింటిని పూర్తి చేయాల్సిందిగా వైన్స్‌ నిర్వాహకులపై ఒత్తిడి తెస్తారు.

అదే మామూళ్లు సకాలంలో చేరితే ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందించరు.డ్రంకెన్‌డ్రైవ్‌ ఇబ్బందులు తప్పించుకునేందుకు మద్యం బాబులు తమ ఇళ్లకు సమీపంలో ఉండే బెల్ట్‌షాపులను ఆశ్రయిస్తున్నారు.

దీంతో వాటికి డిమాండ్‌ పెరుగుతోంది.ఎక్సైజ్‌ అధికారులకు చెల్లించాల్సిన మామూళ్లు సకాలంలో వెళితే బెల్ట్‌షాపులు యథేచ్ఛగా నిర్వహించుకోవచ్చు.

ఎలాంటి తనిఖీలు ఉండవు.ప్రతీనెల అందే లంచాలపై ఆశ తగ్గని ఓ ఎక్సైజ్‌ అధికారి ఎప్పటికప్పుడు టార్గెట్‌ పెంచుతుండడంతో భరించలేని గతంలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని వైన్స్‌ నిర్వాహకులు ఆ అధికారిని ఏసీబీకి పట్టించిన విషయం కూడా తెలిసిందే.

ఈ మొత్తం వ్యవహారం వల్ల నష్టపోతుంది సామాన్య జనమని,సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఎక్సైజ్‌ శాఖ నుంచి వచ్చే ఆదాయమే కీలకం కావడంతో ప్రభుత్వం, అధికారులు ఈ అంశాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారన్నారు.

నెలనెలా మద్యం విక్రయాలు పెరగడమే లక్ష్యంగా నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.ఉన్నతాధికారులు నెలవారీ మద్యం విక్రయ టార్గెట్లపై దృష్టి పెడుతుండగా,ఇదే సాకుగా తీసుకుని జిల్లాలోని ఎక్సైజ్‌, పోలీస్‌ అధికారులు జేబులు నింపుకునే పనిలో పడ్డారనేది బహిరంగ చర్చ.

వీరి బలహీనతలను ఆసరాగా చేసుకుని వైన్స్‌ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బెల్ట్ దందాతో పల్లెలను గుల్ల చేస్తున్నారని టాక్.

ప్రేమలు తర్వాత సరైన సినిమాలనే సెలెక్ట్ చేసుకున్న నస్లెన్, మమితా.. తిరుగుండదు..?