మోడీ జేబు సంస్థగా ఈడి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి

సూర్యాపేట జిల్లా:దేశ ప్రధాని నరేంద్ర మోడీ జేబు సంస్థగా ఈడి, ఏటీఎం కార్డుగా కార్పొరేట్ కంపెనీలు మారాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు.

శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ వెంటాడి తమ చేతుల్లో ఉన్న నిఘా సంస్థలను ఉసిగొలిపి అనేక దాడులు,తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షగట్టి,గవర్నర్ల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు సాగకుండా అడ్డుపడుతూ ఆటంక పరుస్తున్నారని, ప్రజాస్వామిక వాదులపై దాడులు,దౌర్జన్యాలు,హత్యలు,అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారన్నారు.

ఇండియా కూటమిని బలహీనపరిచే కుట్ర కొనసాగుతుందని,సీఐఏ తీసుకొచ్చి ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు.

గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని,ముఖ్యంగా రైతు,కార్మిక వ్యతిరేక చట్టాలు,హద్దు పద్దు లేకుండా అధిక ధరలు పెంచుతూ దేశాన్ని అప్పుల పాలు చేస్తుందన్నారు.

ప్రజల ఆస్తులను అమ్మటం,ప్రజల సంపద మొత్తం ధ్వంసం చేస్తూ కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందన్నారు.

మతం పేరుతో,రాముడి పేరుతో రాక్షస రాజ్యం నడిపిస్తుందన్నారు.దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తామని బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని గుర్తు చేశారు.

ఈ సమావేశంలో సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు,మేదరమెట్ల వెంకటేశ్వరరావు,కోట గోపి పాల్గొన్నారు.

2025 స్ట్రీమింగ్ సినిమాలను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్.. ఓజీ, మాడ్ స్క్వేర్ తో పాటు ఆ సినిమాలు!