ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్లు దాటినా పులిచర్ల రోడ్డుకు మోక్షం లేదు

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలంలోని పులిచెర్ల నుండి పోతునూరు స్టేజీ వరకు నాలుగు కి.

మీ.మేర రోడ్డు మొత్తం శిధిలావస్థకు చేరి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి మోకాళ్ళ లోతు గుంతల్లో గత 15 ఏళ్ల నుండి పది గ్రామాల ప్రజలు,వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నామనిపులిచెర్ల,తదితర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చి పదేళ్లు దాటినా,ప్రభుత్వాలు మారుతున్నా పులిచర్ల రోడ్డు రూపురేఖలు మారలేదని,ఏళ్లు గడిచినా కొద్దీ ఇంకా అద్వాన్నంగా తయారై కంకర తేలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.

ఈ రోడ్డుపై పులిచెర్ల నుండిన పోతునూరు స్టేజీ వరకు వెళ్లేసరికి టైర్లు పంచరైపోతున్నాయని వాహనదారులు భయపడుతున్నారు.

ఇక ఈ రోడ్డుపై ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల పాలైన ఘటనలు అనేకం ఉన్నాయని అంటున్నారు.

ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా గత ప్రభుత్వంలో పట్టించుకోలేదని,తాత్కాలిక ప్యాచ్ వర్క్ తో సరిపెడుతూ వచ్చారని ఆరోపిస్తున్నారు.

పులిచెర్ల మేజర్ గ్రామపంచాయతీ కావడంతో మండల కేంద్రంగా మార్చాలని ఉట్లపల్లి,కేకే తండా, పర్వేదుల,శంకర్ నాయక్ తండా,పోతునూరు, ఎనిమిదిగూడెం,ఎర్రకుంట,పోలేపల్లి తదితర గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగించారని,మేజర్ గ్రామపంచాయతీ అయినప్పటికీ గ్రామానికి రోడ్డు వేయలేకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పోతునూరు స్టేజీ నుండి పులిచర్ల వరకు చుట్టుపక్కల 15 గ్రామాలు ఉండగా ప్రతి ఒక్క అవసరానికి ఇక్కడికే వస్తుంటారని,వచ్చే క్రమంలో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరగడం పరిపాటిగా మారిందని ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ళు,ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్లు పూర్తిగా విస్మరణకు గురైన ఈరోడ్డు ను ఈ ప్రభుత్వంలోనైనా అధికారులు,ప్రజాప్రతినిధులు గుర్తించి కొత్త రోడ్డు మంజూరు చేసి,ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలకు మోక్షం కలిగించాలని కోరుతున్నారు.

దేశంలోనే తొలిసారి.. తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట