ఆదిలోనే వాడిపోతున్న విద్యా కుసుమాలు…!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆహార కలుషితంతో విద్యార్థులు అనారోగ్యం పాలై ఆదిలోనే వసివాడి పోతున్నారని,27 రోజులుగా మృత్యుతో పోరాడి శైలజ మరణం గురుకులాల్లో మృత్యు ఘోషకు నిలువెత్తు నిదర్శనమని అడ్వకేట్, తెలంగాణ ఉద్యమకారుడు కునూరు శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

గురుకుల ఆశ్రమ పాఠశాల్లో,సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో,కస్తూర్బా విద్యాలయాల్లో,ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో నిర్లక్ష్యం తాండవిస్తున్నదని,గత సంవత్సర కాలంగా అనుమానాస్పద మరణాలు, కలుషిత ఆహారం తిని చనిపోవడం వంటి ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ కమిటీలు కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నాయని,సమస్యకు మూల కారణం పరిష్కారం చూపడంపై శ్రద్ధ వహించడం లేదన్నారు.

గురుకులాల నుండి అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాసిరికమైన సరుకులతో విద్యార్థులకు ఆహారం అందించడం జరుగుతుందని వెలుగులోకి వస్తున్న సంఘటనల విచారణలో తేటతెల్లమైందని,బిల్లులు చెల్లిస్తున్నప్పటికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పౌష్ఠికత లేని గుడ్లు,పాలు,ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారని,38 సార్లు ఫుడ్పాయిజన్ తో సుమారు 886 మంది గురైయ్యారంటే వ్యవస్థలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయన్నారు.

ముఖ్యంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ గురుకులాలు, మోడల్ స్కూల్స్,కస్తూర్బా పాఠశాలలు,సంక్షేమ హాస్టల్లో, ఆశ్రమ పాఠశాలలో నియంత్రణ లేకపోవడం,ఎప్పటికప్పుడు సరుకులపై నిఘా,వస్తువులపై తనిఖీలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుందన్నారు.

ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసి భారత పౌరులను తయారు చేసినటువంటి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాలు మరణ మృదంగాలు మోగించండం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు బావి భారత పౌరులుగా, నాయకులుగా,అధికారులుగా ఎదిగి,దేశాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకోపోవాల్సిన వ్యవస్థను కలుషితం చేయడం బాధాకరమన్నారు.

కలుషిత ఆహారం బారినపడి చిన్నారులు అవస్థలు పడడం చూస్తుంటే హృదయం కలచి వేస్తుందని,చివరికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హై కోర్టు కలగజేసుకొని అధికారులను చివాట్లు పెట్టే వరకు పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో అర్దం చేసుకోవాలన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఈ వ్యవస్థలపై ఎప్పటికప్పుడు నియంత్రణ చేస్తూ,నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ప్రాణాలను కాపాడి పౌష్టికాహారాన్ని అందించాలని,వారికి ఆహారంతో పాటు మంచి విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.

వేపతో వావ్ అనిపించే బ్యూటీ బెనిఫిట్స్.. డోంట్ మిస్!