ఎయిరిండియాకు దుబాయ్ షాక్: 15 రోజుల పాటు నిషేధం

ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎయిరిండియాను కరోనా వచ్చి మరింతగా ముంచేసింది.ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో విమానయానం పూర్తిగా స్తంభించింది.

ఆ సమయంలో జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఎయిరిండియా బాధలు వర్ణనాతీతం.అయితే కేంద్రం లాక్‌డౌన్ సడలించడంతో అరకొర సర్వీసులు నడుపుతూ నెట్టుకొస్తోంది.

ఈ క్రమంలో మరోసారి కోవిడ్ ఎయిరిండియాకు షాకిచ్చింది.హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్లిన ఒక ప్రయాణీకుడికి పాజిటివ్ రావడంతో దుబాయ్ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

దుబాయ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 3 వరకు 15 రోజుల పాటు నిషేధిస్తూ దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.

గత రెండువారాల్లో ప్రయాణీకుడికి పాజిటివ్ రావడం ఇది రెండోసారని, కోవిడ్ వచ్చిన వ్యక్తిని గుర్తించకపోవడంపై ఎయిరిండియాను తప్పుబట్టింది.

కోవిడ్ సోకిన వ్యక్తి వల్ల విమానంలో అతనితో పాటు ప్రయాణించిన వారందరూ ప్రమాదంలో పడతారని దుబాయ్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

దుబాయ్‌కు వచ్చిన కరోనా వైరస్ రోగుల వైద్య, క్వారంటైన్ ఖర్చులను భరించాలని జరిమానా సైతం విధించింది.

యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారతదేశం నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడికి అతని ప్రయాణానికి 96 గంటల ముందు ఆర్టీసీపీఆర్ టెస్ట్‌తో పాటు కరోనా నెగిటివ్ వచ్చినట్లు సర్టిఫికేట్ తప్పనిసరి.

కూటమికి భారీ షాకులిస్తున్న 16 మంది రెబల్స్.. ఆ స్థానాల్లో ఓటమి తప్పదా?