సర్పంచునయ్యా…దానం చేయండి!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:కళ్ళు లేని కభోదినయ్యా
దానం చేయండి మహా ప్రభో దానం చేయండయ్యా అంటూ ఎక్కువగా తెలుగు సినిమాల్లో,అప్పుడప్పుడు నిజ జీవితంలో వినపడే మాట.
ఈ విషయం అందరికీ తెలిసిందే.కానీ,ప్రజలకు సేవ చేయాలని ఎంతో కష్టపడి డబ్బు,మద్యం,ఇతర తాయిలాలు ఇచ్చి
ఓ గ్రామానికి సర్పంచ్ గా గెలిచి,ప్రభుత్వ నిధులు వచ్చినా రాకపోయినా తాహతుకు మించి అప్పులు చేసి అభివృద్ధి చేసే ఓ గ్రామ సర్పంచ్,జోలె పట్టి వీధుల్లో తిరుగుతూ సర్పంచ్ నయ్యా దానం చేయండి అంటూ అడుక్కోవడం ఎప్పుడైనా చూశారా?చూడకపోతే నల్లగొండ జిల్లాకు వెళ్లాల్సిందే.
సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సిబ్బందితో కలిసి సర్పంచ్ నయ్యా దానం చేయండి అంటూ బ్యానర్ పట్టుకొని,డప్పులు కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేస్తూ గ్రామంలో
భిక్షాటన చేయడం అందర్నీ ఆశ్చర్య చకితులను చేసింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ
గత ఐదు నెలల కాలంగా సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తే తమను ఆదుకునే దిక్కు లేరని ఆరోపించారు.
మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అప్పుల తెలంగాణగా,అడుక్కునే తెలంగాణగా మారిందన్నారు.
గ్రామపంచాయితీలో పని చేస్తున్న కార్మికులకు గత మూడు నెలల కాలంగా జీతాలు కూడా రావడం లేదని,గ్రామ పంచాయతీకి విధులు మాత్రమే ఉన్నాయని,నిధులు మాత్రం లేవని వాపోయారు.
అందుకే తమ పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేసేందుకే నిరసన వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులతో డప్పు చప్పుళ్లతో భిక్షాటన చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పెద్దాలరా ఆ సర్పంచ్ చెప్పేది నిజమే అయితే నిధులు మంజూరు చేసినా చేయకపోయినా,మీరూ అంతో ఇంతో దానం చేసి గ్రామాన్ని,గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సిబ్బందిని ఆదుకోవాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
నిధులు మంజూరు చేస్తారా లేక తోచిన దానం చేసి చేతులు దులుపుకుంటారా? చూడాలి మరి?.
కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ