మనిషి చనిపోగానే వారి ఆత్మ వేరే శరీరంలో ప్రవేశిస్తుందా?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఆత్మకు చావు పుట్టుకలు లేవని చెప్తుంటారు.అది సర్వ వ్యాపకమైన తత్వం.

శరీరంలో ప్రవేశించేది, వదిలి వేసేది జీవుడు.జీవుడు అంటే సంస్కారముల సాముదాయిక స్వరూపం.

ఉదాహరణకు విద్యుత్తు బల్బులోని ఫిలిమెంటుతో కలిపినప్పుడు కాంతి వస్తుంది.ఆ కాంతి వంటిది జీవుడంటే ఆ బల్బు శరీరము, విద్యుత్తు ఆత్మ.

విదుత్తు బల్బుల కలయిక వలన కాంతి పుట్టినట్లే ఆత్మ, శరీరాల సంయోగం వలన జీవుడు ఏర్పడతాడు.

బల్బు మాడిపోతే విద్యుత్తు పోదు.కాంతి మాత్రమే పోతుంది.

శరీరాన్ని వదిలిన జీవుడు తన సంస్కారాలకు అనుగుణంమైన మరొక శరీరంలో ప్రవేశించడానికి ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు.

తనకనుకూలమైన శరీరం లభించగానే అందులో ప్రవేశించి మరలా పుడతాడు.ఇందుకు ఉదాహరణగా రేడియో తరంగాలను చెప్పుకోవచ్చు.

దేశంలోని వివిధ రేడియో స్టేషన్ల నుండి రేడియో తరంగాలు పంపబడ తాయి.అవి అన్ని ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి.

మన ఇంటిలోని రేడియోలో గల ముల్లును ఒక మీటర్ మీదికి త్రిప్పగానే దానికి సంబంధించిన రేడియో కేంద్రం నుంచి పంపబడిన రేడియో తరంగం అందులో ప్రవేశించి మనకు శబ్ద రూపంగా వినబడుతుంది.

టీవిలో దృశ్యంగా కనబడుతుంది.మనం పెట్టే మాసికాలు, తద్దినాలు కూడా ఇదే ప్రక్రియకు సంబంధించినవి.

వ్యక్తి చనిపోయిన తరువాత ఒక సంవత్సరం వరకు మాసికాలు పెడతాము.చనిపోయిన వ్యక్తి పెద్ద కుమారుడు ఆ మాసికం పెట్టాలి.

చనిపోయిన వ్యక్తి యొక్క సంస్కార స్వభావాలు పెద్ద కుమారునికే ఎక్కువ తెలిసి ఉంటాయి.

ఇందులోచేసే పిండ ప్రదానానికి అర్థం శరీర దానమని, పిండమంటే శరీరమే.ఈ ప్రక్రియ అంతా చనిపోయిన వ్యక్తి తన గర్భ వాసంలోనికి ప్రవేశించమని కోరడమే.

ఎటొచ్చీ ఈ విధంగా ప్రవేశించడానికి ఎంత కాలం పడుతుంది? అన్న ప్రశ్నకు సమాధానంగా గడ్డి పురుగు ఉదాహరణ చెప్పబడింది.

గడ్డి పురుగు తన ముందు కాళ్లను ఒక గడ్డి పరక మీద పెట్టిన తరువాతనే వెనుక కాళ్లు తన దగ్గరకు తీసుకుంటుంది.

ఆ విధంగా తీసుకోవడానికి ఒక్క క్షణం పట్టవచ్చు లేదా ఒక సంవత్సరం పట్టవచ్చు.

కాలమన్నది సాపేక్షం కావడం వలన క్షణమన్నా, సంవత్సరమన్నా ఒక్కటే.పైగా ఆ గడ్డి పురుగుకు ముందు కాళ్లు పెట్టుకోవడానికి కావలసిన గడ్డి పరక కనిపించాలి కదా !.