అమెరికా : వీసా జారీలలో అలసత్వం..భారత ఎన్నారైల ఆందోళన

అగ్ర రాజ్యం అమెరికాకు ఉన్నత ఉద్యోగాల కోసం వలస వెళ్ళిన ఎన్నారైలలో మెజారిటీ శాతం మంది భారత్ నుంచీ వెళ్ళిన వారే ఉంటారు.

అలా వలసలు వెళ్ళిన వారు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఆర్ధికంగా స్థిరపడిన ఎన్నారైలు తమ జీవిత భాగస్వాములను హెచ్ -4 ఈఏడి ఆధారంగా ఉద్యోగాలు చేసే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.

ఈ వర్క్ పర్మిట్ ఉన్నవారు మాత్రమే అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు అర్హులుగా ఉంటారు.

అయితే తాజాగా వీసాల జారీలలో జరుగుతున్న జాప్యం కారణంగా భారతీయ ఎన్నారై కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.

మరీ ముఖ్యంగా వర్క్ పర్మిట్ లపై ఆధారపడి ఉన్న ఎంతో మంది ఎన్నారైలు ఈ అలసత్వం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.

కొందరు ఉద్యోగాలు కోల్పోయి ఆవేదన చెందుతుంటే మరి కొందరు జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న నిభంధనల ప్రకారం హెచ్ 1-బి వీసా కలిగిన వారి జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్ -4 విసా దారులు, హెచ్ -4 ఈఏడి వర్క్ పర్మిట్ ఉన్నవారు ఈ వీసాల రెన్యువల్ చేసుకోవడానికి బయోమెట్రిక్ ఉన్న వీసా కేంద్రాలకు వెళ్లి చేసుకోవాలి అయితే కరోనా తీవ్రత కారణంగా సదరు వీసా కేంద్రాలను మూసేశారు కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత తిరిగి వాటిని పునరుద్ధరణ చేసినా వాటిలో పనిచేసే ఉద్యోగులు లేకపోవడంతో రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరుగుతోంది.

దాంతో ఈ పరిస్థితులపై స్పందించిన ప్రభుత్వం వర్క్ పర్మిట్ ల కాల పరిమితిని కొంత కాలం పొడిగించింది కానీ ఈ అవకాశం కేవలం కొందరికి మాత్రమే ఉపయోగపడింది.

అంతేకాదు పెంచిన గడువు కేవలం రెన్యువల్ చేసుకోవాల్సి ఉండి కాలపరిమితి దాటిన వారికి మాత్రమే ఇవ్వడంతో కొత్తగా ఈ వీసాలకు దరఖాస్తులు చేసుకునే వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

దాంతో కొందరు వీసా రెన్యువల్స్ లేటు గా జరగడం, కొత్త వీసాలు మంజూరు చేయకపోవడంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని స్థానిక భారతీయ సంఘాలు వాపోతున్నాయి.