ప్రాణాలకు తెగించి.. చిన్నారిని రక్షించాడు!

ఇంట్లో చిన్నారులు ఉంటే వారిపై పెద్దలు ఓ కన్నేసి ఉంచాలి.ఒక్కోసారి ఆడుకుంటున్న క్రమంలో ప్రాణాపాయం ఎదురవుతుంటుంది.

ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులోకి పొరపాటున దూకడమో, బాల్కనీ నుంచి జారిపడడమో, కిచెన్‌తో పదునైన చాకు ఆడుకుంటూ అది కోసుకోవడమో జరుగుతుంటుంది.

ఇదే కోవలో మూడేళ్ల వయసున్న ఓ చిన్నారి పొరపాటున కిటికీలో నుంచి దూకేసింది.

అయితే ఓ వ్యక్తి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసం చేశాడు.

ఆ చిన్నారి ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కజకిస్థాన్‌ దేశంలోని కైజ్లోర్డా ప్రాంతానికి చెందిన సబిత్ సంతన్‌బయేవ్ అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

జీవనోపాధి కోసం, భార్యాపిల్లలకు మంచి జీవితం అందించేందుకు పని వెతుక్కుంటూ నుర్‌సుల్తాన్ అనే ప్రాంతానికి వచ్చాడు.

అక్కడే ఉద్యోగం చూసుకుని, నిత్యం డ్యూటీకి వెళ్లి వస్తున్నాడు.ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తన స్నేహితుడితో కలిసి సబిత్ నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఆ సమయంలో ఓ చోట 8వ అంతస్తు నుంచి పడిపోయిన ఓ మూడేళ్ల చిన్నారి అదృష్టవశాత్తూ కిటికీకి వేలాడడం గమనించాడు.

ఏ మాత్రం ఆలస్యం చేసినా, ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసి పోయే ప్రమాదం ఉందని సబిత్ గ్రహించాడు.

అంత ఎత్తులో ఆ చిన్నారిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టాడు.

ఏడో ఫ్లోర్ కిటికీ లో నుంచి బయటకు శరీరాన్ని ఉంచాడు.లోపల బిల్డింగ్‌లో నుంచి అతడి కాళ్లను అతడి ఫ్రెండ్ పట్టుకున్నాడు.

అతడి ఫ్రెండ్ ఏ మాత్రం పట్టు సడలించినా, సబిత్ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

అయినప్పటికీ చిన్నారిని కాపాడేందుకు ఈ సాహసం చేశాడు.ఎట్టకేలకు కిటికీకి వేలాడుతున్న ఆ చిన్నారిని పట్టుకుని, భద్రంగా ఇంట్లోకి తీసుకొచ్చాడు.

ఈ సాహసాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.దీంతో ఒక్కసారిగా సబిత్ సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు.

నలుగురు పిల్లల తండ్రి అయినప్పటికీ, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అతడు చేసిన సాహసానికి నెటిజన్లు అంతా జేజేలు కొట్టారు.

సబిత్‌కు నగరం యొక్క డిప్యూటీ ఎమర్జెన్సీ మినిస్టర్ మెడల్ అందించారు.అతనికి 3-బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌, టీవీని కూడా ప్రదానం చేసినట్లు తెలుస్తోంది.

భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్