అస్సాంలో నల్లగొండ ఆర్మీ జవాన్ మృతి… మదారిగూడెంలో విషాదం
TeluguStop.com
నల్లగొండ జిల్లా: దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఆర్మీలో చేరిన తన బిడ్డ అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడని తెలుసుకున్న తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెం గ్రామానికి చెందిన ఈరేటి యాదయ్య,పార్వతమ్మ మూడవ సంతానమై ఈరేటి మహేష్ (24) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపధ్ పథకంలో భాగంగా 2022 లో సూర్యాపేటలో జరిగిన సెలక్షన్లో ఆర్మీకి ఎంపికయ్యారు.
కాగా గత రెండేళ్లుగా అస్సాంలోని దబీర్ ఘాట్ ప్రాంతంలో సైనిక భద్రత దళాల్లో విధులు నిర్వహిస్తున్నాడు.
ఈనెల 9న మహేష్ కు తీవ్రమైన జ్వరంతో ఛాతిలో నొప్పి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో అధికారులు స్థానిక సైనిక ఆసుపత్రికి తరలించి వారం రోజులు చికిత్స అందించారు.
పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.మహేష్ ఛాతిలో నొప్పి అధికంగా ఉందని చెప్పడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది.
గురువారం రాత్రి మహేష్ చికిత్స పొందుతూ మృతి చెందారు.మహేష్ మృతదేహాన్ని సైనిక లాంఛనాల ప్రకారం ప్రత్యేక హెలికాప్టర్ లో శుక్రవారం సికింద్రాబాద్ కు తీసుకురానున్నట్టు తెలుస్తుంది.
విధినిర్వహణలో మృతి చెందిన ఈరేటి మహేష్ తండ్రి యాదయ్యకు ముగ్గురు సంతానం.రెండో కుమారుడు ఈరేటి నరేష్ 2019 సంవత్సరంలో మిలిటరీలో చేరాడు.
నరేష్ జమ్మూ కాశ్మీర్ లోని మహార్ లో భద్రత దళాల్లో విధులు నిర్వహిస్తున్నాడు.
అన్న సైనికుడు కావడంతో తాను కూడా దేశానికి సేవ చేస్తామని మహేష్ 2022 సంవత్సరంలో అగ్నిపథ్ ద్వారా ఉద్యోగం సాధించాడు.
గ్రామానికి చెందిన ఈరేటి మహేష్ ఆర్మీలో పని చేస్తూ మృతి చెందడం పట్ల గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున మహేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాతున్నారు.
దేశభద్రత కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బాధ్యతలు నిర్వహించిన మహేష్ తన గ్రామానికి ఎంతో గర్వకారణమని గ్రామస్తులు పేర్కొన్నారు.
కుమారుడి అకాల మృతితో మహేష్ తల్లి పార్వతమ్మ గుండెలు పగిలేలా విలపిస్తూ రోధించడం గ్రామస్తులను కంటతడి పెట్టిస్తుంది.
షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. విద్యార్థిని నుజ్జునుజ్జు!