సాగర్ ఎడమ కాల్వకట్టకు పొంచి ఉన్న ప్రమాదం…!

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ ( Peddadevulapally Reservoir )సమీపంలో డెయిరీ ఫాం తూము వద్ద నెల రోజులు క్రితం సాగర్ ఎడమ కాల్వ కట్టపై భారీ రంధ్రం పడింది.

తూముకు సమీపంలో రంధ్రం పడడంతో కట్ట తెగే ప్రమాదం ఉందని,రోజులు గడుస్తున్నా ఆధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల పాలేరుకు ఎడమ కాల్వకు నీటిని వదిలిన సమయంలో ఈ రంధ్రం పడిందని స్థానిక రైతులు అంటున్నారు.

అయితే ఈ రంధ్రం పడిన ప్రదేశంలో కాల్వలో నీరు కమ్ముకుని ఉంటుందని,కాల్వకు నీటిని వదిలే అవకాశం ఉన్నందున త్వరగా పనులు పూర్తి చేయకపోతే కట్టతెగే ప్రమాదం ఉందని, ఇక్కడ కట్ట తెగితే త్రిపురారం,మిర్యాలగూడ, దామరచర్ల మండలాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.

కట్టపై రాకపోకలు సాగించేవారు అందులో పడే ప్రమాదం ఉండడంతో రైతులు ఆ రంధ్రం చుట్టూ కంప వేశారు.

ఎన్ఎస్పీ అధికారులు స్పందించి రంధ్రం పూడ్చాలని కోరుతున్నారు.దీనిపై ఎన్ఎస్పీ డిఇని వివరణ కోరగా మరమ్మత్తు పనులు ఒకటి రెండు రోజుల్లో మొదలు పెట్టి వారం రోజుల్లో పూర్తి చేపిస్తామని చెప్పారు.

విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో పాగా వేసినట్టేనా..?