నకిలీ విత్తనాల చెలామణిపై ఉక్కుపాదం మోపండి: మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాల చెలామణిని ఉక్కుపాదంతో అణిచివేయలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.

నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్లు,పోలీస్ కమిషనర్లు,ఎస్పీలు, వ్యవసాయ,ఉద్యానవన శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర డీ.

జీ.పీ అంజనీ కుమార్,వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా చేయుటకు, ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా,రైతాంగ ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు.

వానాకాలం సాగుకు సంబంధించి సుమారు 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.

అదే సమయంలో నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.

ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా మార్కెట్లో చెలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్దీకరించాలని ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా నకిలీ విత్తనాలనే పదం వినిపించకూడదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నందున ఎంతో అప్రమత్తతో విధులు నిర్వర్తించాలన్నారు.

దేశ వ్యాప్తంగా అవసరమైన విత్తనాలలో అరవై శాతం విత్తనాలను తెలంగాణ రాష్ట్రమే సమకూరుస్తుందని, ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఆంధ్ర, గుజరాత్ తదితర ప్రాంతాల నుండి నకిలీ సీడ్ మన రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

నకిలీ విత్తనాల తయారీదారులు,వాటి విక్రేతలను గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అలాగే గడువు ముగిసిన విత్తనాలను, లైసెన్స్ లేకుండా విక్రయించే వాటిని,ఒక ప్రాంతంలో లైసెన్స్ కలిగి ఉండి,వేరే చోట విక్రయాలు జరిపే వారి పైనా చర్యలు చేపట్టాలని సూచించారు.

అయితే,స్టాక్ రిజిస్టర్,బిల్ బుక్ నిర్వహణ వంటి చిన్న చిన్న లోపాలను గుర్తించిన సమయాల్లో వాటిని సవరించుకోవాల్సిందిగా డీలర్లకు సూచించాలని,ఆ మేరకు మార్పు రాని పక్షంలో నిబంధనలను అనుసరిస్తూ చర్యలు చేపట్టాలన్నారు.

కాగా, పోలీస్ శాఖ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందాలు సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తూ, విరివిగా తనిఖీలు నిర్వహించాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు.

గతేడాది సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి నకిలీ విత్తనాల బెడద లేకుండా కట్టడి చేశారని,ప్రస్తుతం కూడా అదే స్పూర్తితో పని చేయాలని అన్నారు.

పదేపదే నకిలీ విత్తనాల దందాను నిర్వహించే వారిని గుర్తిస్తూ, అవసరమైతే పీడీ యాక్టు పెట్టాలని సూచించారు.

నకిలీ విత్తనాల కేసులతో సంబంధం కలిగి ఉన్న పాత నేరస్థులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ నకిలీ,నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా జిల్లాలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా కఠిన చర్యలు చేపడతామని,నకిలీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయ,పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో నకిలీ విత్తనాలు లేకుండా చేస్తామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పాటిల్ హేమంత కేశవ్,జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రాజేంద్రప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్,డిఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్లు,రవికుమార్, వ్యవసాయ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్ రాజాసాబ్ పరిస్థితి ఏంటి..?