తెలకపల్లి వద్ద ఉద్రిక్తత,ఎంపీ రేవంత్ తో సహా పలువురి అరెస్ట్….!

నాగర్ కర్నూల్ జిల్లా లోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే.

ఈ పథకం మొదటి దశ లిఫ్టు పంపుహౌస్‌ లోపల పంపింగ్‌ నడుస్తున్న సమయంలో మోటార్‌ బిగించిన ఫౌండేషన్‌ బోల్టులు ఒక్కసారిగా ఎగిరి పడడం తో వరదనీరు ఒక్కసారిగా పంప్‌హౌస్‌లోకి వచ్చింది.

అయితే ఒక్కసారిగా నీరు పంప్ హౌస్ లోకి రావడం తో ఆ నీటిని ఆపే అవకాశం లేక కొన్ని నిమిషాల్లోనే ఆ నీరు పంప్‌హౌస్‌లోని చాలా అంతస్తుల్లోకి చేరింది.

దీనితో నీటిని ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సిబ్బంది, ఇంజనీర్లు బయటకు పరుగులు తీసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

అయితే శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఆ ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరారు.

అయితే ఉప్పునుంతల నుంచి కొల్లాపూర్‌ వరకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు తెలకపల్లి వద్ద అడ్డుకోవడం తో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

మరోపక్క అక్కడకు వెళుతున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి వాహనాన్ని కూడా పోలీసులు అడ్డగించడం తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

పోలీసుల తీరుపై రేవంత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.కారులో నుంచి దిగకుండా గంటపాటు అలానే కూర్చోవాల్సి వచ్చింది.

దీంతో కొందరు కాంగ్రెస్ శ్రేణులు అక్కడకు చేరుకొని, నాగర్‌కర్నూల్- అచ్చంపేట రహదారిపై బైఠాయించి, రేవంత్ సహా మిగతా నేతలను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ వద్దకు అనుమతించాలంటూ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ శ్రేణుల వ్యవహారం కారణంగా అక్కడ రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టే క్రమంలో రేవంత్‌రెడ్డి కి పోలీసులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రేవంత్‌రెడ్డి కాలికి స్వల్ఫ గాయమైనట్లు తెలుస్తుంది.దీనితో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా రేవంత్, మల్లు రవి, సంపత్‌కుమార్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పునుంత పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తుంది.

అయితే పోలీసుల తీరుపై రేవంత్ తీవ్ర స్తాయిలో మండిపడ్డారు.

కొడుకు పేరుపై అన్నా కొణిదెల భారీ విరాళం.. ఆమె మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!