నిఖిల్ హత్యపై మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రానికి చెందిన గిరిజన న్యాయశాస్త్ర విద్యార్థి ధరావత్ నిఖిల్ హత్య జరిగి 20 రోజులు కావస్తున్నా నేటికీ పోలీసులు నిందితులను గుర్తించకుండా కేసులో చేస్తున్న జాప్యానికి నిరసనగా గురువారం హైదరాబాదులోని ఎస్సీ,ఎస్టీ కమిషన్లో ఉపసంచాలకులు చంద దాస్ మరియు మానవ హక్కుల కమిషన్లో నిఖిల్ తండ్రి దరావత్ భాస్కర్ చేత ఫిర్యాదు చేయించడం జరిగిందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్,కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.

స్కైలాబ్ బాబు,డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువలాయర్ ధరావత్ నిఖిల్ ది ముమ్మాటికీ కుల దురహంకార హత్యేనని ఆరోపించారు.

హత్య జరిగి ఇరవై రోజులు కావస్తున్నా ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడం పోలీసుల వైఫల్యమేనని అన్నారు.

దీనికి జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.గిరిజన యువకుడు కావడం వల్లనే పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

ధరావత్ నిఖిల్ అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడని వారే సుపారీ ఇచ్చి తన స్నేహితుల సహకారంతో హత్య చేయించినట్టు కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తున్నదని,పోలీసులు ఆ వైపు విచారణ జరపకుండా కేవలం స్నేహితుల మధ్య తగాదాగా చిత్రీకరించి ఆత్మహత్య కోణంలో కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం అన్యాయమని అన్నారు.

దేశంలోనే తెలంగాణ పోలీసులు టెక్నాలజీ పరంగా ప్రథమ స్థానమని చెప్పుకునే ప్రభుత్వం నిఖిల్ హత్య జరిగి 20 రోజులు కావస్తున్న దుండగులను ఎందుకు గుర్తించలేదో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రెండురోజుల్లో హత్య చేసిన దుండగులను పట్టుకోకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్,ఎస్సీ,ఎస్టీ కమిషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

త్వరలోనే దళిత,గిరిజన ప్రజా సంఘాలను సంప్రదించి రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సంఘం జిల్లా ఇన్చార్జ్ ధరావత్ వీరన్న నాయక్,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,గిరిజన శక్తి నాయకులు వెంకటేష్ నాయక్,గిరిజన సంఘాల నాయకులు డాక్టర్ ఆనంద్ నాయక్,జితేందర్ నాయక్, ధర్మానాయక్,మంగతా నాయక్,సమీర్ తదితరులు పాల్గొన్నారు.

చిరంజీవితో అకీరా ఫస్ట్ సినిమా… మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్!