ప్లాస్టిక్ కవర్ నిషేధంపై అమలుకు నోచుకోని కమిషనర్ ప్రకటన

నల్లగొండ జిల్లా:నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ కవర్ నిషేధమని మున్సిపాలిటీ కమిషనర్ ప్రకటించి మూడు నెలలు అవుతున్నా నేటికీ అమలుకు నోచుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కమిషనర్ చేసిన ప్రకటన కేవలం కాగితాలకే పరిమితం అయ్యిందని,ఎక్కడా ప్లాస్టిక్ కవర్లు నిషేధం జరిగిన దాఖలాలు కనిపించడం లేదని, పట్టణంలో ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా చెత్తా చెదారంతో పేరుకుపోయి దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు.

నిషేధం ఉన్నప్పటికీ దుకాణాల్లో, చికెన్,మటన్,ఫిష్ మార్కెట్లలో, పండ్లు,కూరగాయల బండ్ల వద్ద ఇక్కడ అక్కడ అని ఏమీలేదు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు బహిరంగంగా లభిస్తున్నాయి.

అయినా మున్సిపాలిటీ అధికారులు,సిబ్బంది అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ కమిషనర్ ప్లాస్టిక్ కవర్ నిషేధ ప్రకటనను గాలికి వదిలేశారని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎవరైనా దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లు అమ్ముతే పది వేల రూపాయలు జరిమానా వేయడం జరుగుతుందని ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదంటే ప్లాస్టిక్ కవర్ల అమ్మకానికి పరోక్షంగా అధికారుల మద్దతు ఉన్నట్లుగా భావిస్తున్నారు.

ప్లాస్టిక్ రహిత పట్టణం కోసం చేపట్టిన పథకం నీరుగారిపోతున్నా ఎవరూ పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని, ఇప్పటికైనా ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ప్రవాసీ భారతీయ దివస్ 2025 .. భువనేశ్వర్‌లో ఎన్ఆర్‌లకు భారీ స్వాగత ఏర్పాట్లు