హుజూర్ నగర్ కు వస్తున్నా,అందరికీ వడ్డీతో సహా వడ్డిస్తా: ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటి(టీపీసీసీ)మాజీ అధ్యక్షుడు,మాజీ మంత్రి, హుజూర్ నగర్,కోదాడ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం, నక్కగూడెం,వేపల మాధారం మరియు రామాపురం గ్రామాల్లో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హుజూర్ నగర్ నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీపీసీసీ రథసారథిగా పార్టీని నడిపించిన ఉత్తమ్ ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్ర రాజకీయాలలో స్థానం సంపాదించుకున్నారు.

రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ రెండుసార్లు అధికారాన్ని కైవసం చేసుకొన్నా,హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి,తన సత్తా చాటుకున్నారు.

కానీ,కాంగ్రేస్ పార్టీ నుండి గెలిచిన కొంతమంది నేతలు గులాబీ గూటికి చేరడంతో రాష్ట్రంలో కాంగ్రేస్ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోయింది.

దీనితో పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుండి పోటీలో నిలిచి గెలిచే సరైన నేత లేకపోవడం,ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే తప్పనిసరి పరిస్థితుల్లో పార్లమెంట్ బరిలో దిగాల్సి వచ్చింది.

అప్పటికే హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ అనూహ్యంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడుగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావడంతో తమ సతీమణి పద్మావతిని అభ్యర్థిగా నిలబెట్టారు.

అధికార టీఆర్ఎస్ నుండి తనపై ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డికే ఆ ఉప ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు.

దీనితో అధికార పార్టీ అంగ,అర్ధబలం,రెండుసార్లు ఒడిపోయాడన్న సానుభూతి,భర్త బదులు భార్య పోటీ చేయాలా? అనే వ్యతిరేకత,ఎంపీగా గెలిచేందుకు టీఆర్ఎస్ తో ఉత్తమ్ చీకటి ఒప్పదం పెట్టుకున్నారనే ప్రచారం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో పద్మావతి ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

దీనితో ఉత్తమ్ ప్రతిభ మసక బారిందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.ఒకవైపు కేసీఆర్ దూకుడు,మరొక వైపు కాంగ్రెస్ పతనం.

ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉత్తమ్ టీపీసీసీ నుండి వైదొలగక తప్పలేదు.దీనితో అప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఉత్తమ్ ఛర్మిషా కేవలం నల్లగొండ పార్లమెంట్ స్థానానికే పరింతమైందని చెప్పకతప్పదు.

ఇదిలా ఉంటే రాష్ట్ర స్థాయి నేతగా ఉంటూనే ఉత్తమ్ హుజూర్ నగర్ నియోజకవర్గ వర్గాన్ని ఎప్పుడూ దూరం పెట్టలేదు.

పేరుకు నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు అయినా,హుజూర్ నగర్ ఎంపీనా అన్నట్లుగా తనకు సమయం దొరికినప్పుడల్లా నియోజకవర్గ పరిధిలో పర్యటనలు చేస్తూ,పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ, తన పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డిపై ఘాటైన విమర్శలు చేస్తూ ఎప్పటికప్పుడు నియోజకవర్గ రాజకీయ వాతావరణం వేడెక్కిస్తూ వచ్చారు.

తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాలపై అభిమానంతో,పరిచయాలతో ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారని,ఉత్తమ్ ఇక జాతీయ రాజకీయాల వైపు వెళతారని అందరూ భావించారు.

కానీ,అందరి అంచనాలను తారుమారు చేస్తూ శ్రీరామ నవమి రోజు ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో దుమారం రేవుతున్నాయి.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా తానే పోటీలో ఉంటున్నానని ప్రకటించేశారు.

అక్కడితో ఆగకుండా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,ఇప్పటి వరకు పార్టీ నేతలకు,కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారికి,అక్రమ కేసులు పెట్టించిన వారికి,పెట్టిన వారికి,ప్రజా ధనాన్ని దోచుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదని,అన్నీ గుర్తుపెట్టుకున్నాం,ఎవ్వరినీ మరిచిపోము అన్నిటికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో హుజూర్ నగర్ రాజకీయాల్లో రెండేళ్లకు ముందే ఎన్నికల వేడి రగులుకుంది.

ఇక కెప్టెన్ బరిలో దిగడం ఖాయమని తెలియడంతో నియోజకవర్గ కాంగ్రేస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

ఉప ఎన్నికల్లో గెలిచిన సైదిరెడ్డి నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ,లీడర్ క్యాడర్ ను పటిష్ఠ పరుచుకుంటూ యమ స్పీడ్ గా ముందుకెళుతున్నారు.

అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలని,దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నీ ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్యేకు ఉత్తమ్ వ్యాఖ్యలు కొరకరాని కొయ్యలాగా మారాయని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

హుజూర్ నగర్ లో పద్మావతిపై గెలిచినంత సులువు కాదు ఉత్తమ్ ను ఢీ కొట్టడం అని క్షేత్ర స్థాయిలో జోరుగా చర్చ జరుగుతోంది.

ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని పీకే సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్ కి నివేదిక ఇచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్న తరుణంలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎవరుంటారు, ఎవరు పోతారో తెలియక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్న పరిస్థితుల్లో ఉత్తమ్ పేల్చిన బాంబ్ హుజూర్ నగర్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో లేదో తెలియదు కానీ,ఉత్తమ్ హుజూర్ నగర్ బరిలో దిగితే సైదిరెడ్డికి సంకటమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మొత్తం కథ కంచికి చేరాలంటే కేసీఆర్ ముందస్తు లాంటి నిర్ణయం తీసుకోకపోతే ఇంకా రెండేళ్లు ఎదురు చూడక తప్పదు.

హుజూర్ నగర్ కు ఉత్తమ్ కెప్టెన్ అవుతారా? శానంపూడి శాసిస్తాడా చూడాలి మరి.

!!!.

ఆయన 25ఏళ్ల కష్టమే ఎక్స్‌పీరియం పార్క్‌: మెగాస్టార్ చిరంజీవి