పంజాబ్‌లో పెట్టుబడులు పెట్టించండి.... కెనడా ప్రతినిధి బృందాన్ని కోరిన సీఎం భగవంత్ మాన్‌

విద్వేషనేరాలు పెరుగుతున్న నేపథ్యంలో కెనడాలో వున్న భారతీయులు అప్రమత్తంగా వుండాలని కేంద్ర విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కెనడాతో సత్సంబంధాలను పెంచుకోవాలని భావిస్తున్నారు.

ముఖ్యంగా అక్కడి సస్కట్చేవాన్ ప్రావిన్స్‌తో బంధాన్ని బలోపేతం చేయాలని యత్నిస్తున్నారు.ఈ రోజు సీఎం భగవంత్ మాన్‌తో సస్కట్చేవాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యింది.

ఈ సందర్భంగా పంజాబ్, సస్కట్చేవాన్‌ మధ్య బలమైన , స్నేహపూర్వక సంబంధాలను భగవంత్ మాన్ పునరుద్ఘాటించారు.

కెనడా ఆర్ధిక పురోగతిలో పంజాబీలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు.అలాగే కెనడా రాజకీయ రంగంలోనూ పంజాబీలు తమకంటూ సముచితమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని సీఎం గుర్తుచేశారు.

ఇది రాష్ట్రానికి గర్వకారణమన్నారు.భారత్‌లో పారిశ్రామిక రంగానికి పంజాబ్‌‌లో అనుకూలమైన వాతావరణం వుందని భగవంత్ మాన్ పేర్కొన్నారు.

పంజాబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సస్కట్చేవాన్ ప్రతినిధుల బృందాన్ని సీఎం కోరారు.

కెనడాలో స్థిరపడిన పంజాబీలు రాష్ట్రంలోని బ్రాండెడ్ ఉత్పత్తులను సజావుగా, అవాంతరాలు లేకుండా పొందగలరని భగవంత్ మాన్ అన్నారు.

రాష్ట్రానికి చెందిన సోహ్నా వంటి బ్రాండ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు.

వీటితో పాటు నెయ్యి, పాలు, వెన్న, లస్సీ, ఖీర్, పెరుగు, ఐస్‌క్రీమ్, స్వీట్లు వంటి వెర్కా సంస్థ ఉత్పత్తులు ఇప్పటికే తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

దీనిపై స్పందించిన కెనడా బృందం.పంజాబ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలను అందజేస్తామని భగవంత్ మాన్‌కు హామీ ఇచ్చారు.

"""/" / కాగా.విద్వేషనేరాలు, హింస పెరుగుతున్న నేపథ్యంలో కెనడాలో వున్న భారతీయులు నిత్యం అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది.

ఈ మేరకు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.విద్వేష నేరాలకు పాల్పడిన వారిపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విదేశాంగ శాఖ పేర్కొంది.

అయినప్పటికీ కెనడాలోని భారత హైకమీషన్ కూడా విద్వేషనేరాలకు పాల్పడుతోన్న వారిపై చర్యలు తీసుకునేలా స్థానిక యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొస్తోందని కేంద్రం తెలిపింది.