నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ పరస్పరం కర్రలతో కొట్టుకునే వరకు రావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఓ యువతి ఆటోలో ప్రయాణిస్తుండగా పక్కన ఆటోలో ప్రయాణిస్తున్న పోకిరీలు యువతి వైపు చూస్తూ అసభ్యకర సంజ్ఞలు చేయడంతో ఆ యువతి,ఆటో డ్రైవర్ పోకిరీలను మందలించారు.
దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదంజరిగింది.పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో ఆ యువతి,ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టూ పోలీస్ స్టేషన్( Police Station ) కు వెళ్లగా వేధింపులకు గురిచేసిన పోకిరీలు స్టేషన్ వద్దకు చేరుకొని మళ్ళీగొడవకు దిగారు.
ఇరు వర్గాలకు చెందిన మరికొందరు స్టేషన్ వద్దకు చేరుకోవడంతో గొడవ పెద్దగా మారింది.
మాటామాటా పెరగి కర్రలతో పరస్పర దాడికి దిగడంతో ఇద్దరి యువకుల తలల పగిలాయి.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పి చెదరగొట్టాల్సి వచ్చింది.
తాము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామని వస్తే పోకిరీలు మూకుమ్మడిగా వచ్చి తమపై దాడి చేశారని బాధితురాలు చెబుతుంది.
మిర్యాలగూడ( Miryalaguda ) పట్టణంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయని,పోకిరిల ఆగడాలు పెచ్చుమీరి పోతున్నాయని, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ఎంతమందిపై కేసులు పెట్టినా యువతలో మార్పు రావడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనెలలో ఇది మూడో ఘటనని,ప్రకాష్ నగర్, రెడ్డికాలనీలో రాత్రిసమయంలో నడుచుకుంటూ వెళ్తోన్న మహిళలను గంజాయి బ్యాచ్ వేధించిన విషయం బయటకు రాకుండా సెటిల్ చేసినట్లు సమాచారం.
యువకుల తల్లితండ్రులు,పోలీస్ సిబ్బంది ఇప్పటికైనా స్పందించి యువతలో మార్పు తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేయాలని పట్టణ మహిళలు,యువతులు కోరుతున్నారు.