బాబు టెన్షన్ అంతా వారి గురించే ? అదే జరిగితే ?

మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం తీసుకువచ్చామనే ఆనందం చంద్రబాబు లో కనిపించినా, ఆయన లోపల బాధ మాత్రం చాలా ఎక్కువగానే ఉందని టిడిపి కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం వైసిపి ప్రభుత్వానికి కోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగలడం, ప్రజల్లోనూ ఒకింత ప్రభుత్వంపై అసంతృప్తి ఉందనే వార్తలు టిడిపిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

చంద్రబాబు ప్రస్తుతం విరామం తీసుకునే అవకాశం ఉన్నా, ఎక్కడా ఆయన విరామం,విశ్రాంతి తీసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

దీనంతటికీ అసలు కారణం వేరే ఉంది.ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునే విషయంపై వైసిపి పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది.

ఇప్పటికే ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది.ఇలా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా రాకుండా చేయాలన్నదే ఆ పార్టీ అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఆ భయంతోనే చంద్రబాబు నిరంతరం పార్టీ శ్రేణులతో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులను ఆరా తీస్తూ వస్తున్నారు.

వైసీపీలో చేరేందుకు ఎవరెవరు సముఖంగా ఉన్నారు అన్న విషయాలను ఆరా తీస్తూ, వారు పార్టీకి రాజీనామా చేయకుండా కీలక నేతల ద్వారా వారితో రాయబారాలు చేయిస్తూ వస్తున్నారు.

పార్టీ మారొద్దని, భవిష్యత్తులో పార్టీలో సముచిత స్థానం ఇవ్వడంతోపాటు, మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత కీలక పదవులు ఇస్తామనే హామీలు కూడా వారికి ఇస్తూ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

విశాఖకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైసిపి నాయకులతో టచ్ లో ఉన్నారని, వారు త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందనే వార్తలు చంద్రబాబు ని కలవరపెడుతున్నాయి.

అలాగే గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట.

ఇక ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వైసీపీలో చేరాలని చూసినా ఇప్పుడు మాత్రం ఆయన టిడిపి లోనే ఉంటాను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చినా, బాబుకు మాత్రం నమ్మకం కుదరడం లేదు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా బాబు కు సమాచారం అందింది.

ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు కనుక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే, ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందనే భయం చంద్రబాబులో ఎక్కువ అయ్యింది.

అందుకే మహానాడులో అసంతృప్తులను బుజ్జగించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.ఏ క్షణాన ఏ ఎమ్యెల్యే చేజారిపోతాడో తెలియక చంద్రబాబు టెన్షన్ పడుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

నేటి ఎన్నికల ప్రచారం : కడప లో షర్మిల .. జగన్ ఎక్కడంటే ?