సిసిఐ కేంద్రాలు దళారులకు అడ్డాగా మారాయా…?

నల్లగొండ జిల్లా: ఆరుగాలం కష్టపడి,అప్పులు చేసి పడి పండించిన పంటను దళారులు గద్దల్లా తన్నుకుపోతూ రైతులను దగా చేస్తున్నారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నామని నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా పత్తి కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిసిఐ కేంద్రాల వద్ద అధికారులు, దళారులు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గ పరిధిలో పత్తి దిగుమతి ఎక్కువగా రావడంతో సీసీఐ కేంద్రాలకు రైతులు తెచ్చిన పత్తిని తేమ,రంగు పేరుతో కొర్రీలు పెడుతూ రోజుల తరబడి వేచి చూసేలా ఇబ్బందులకు గురి చేస్తూ,దళారులు తీసుకొచ్చిన పత్తిని మాత్రం గంటల వ్యవధిలోనే దిగుమతి చేస్తూ దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని, దిక్కుతోచని స్థితిలో చివరికి దళారులను ఆశ్రయించగా ఇదే అదునుగా దళారులు అడ్డికి పావుశేరులాగా రైతు దగ్గర కొనుగోలు చేస్తూ అడ్డగోలుగా దందాకు తెరలేపారని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లోకి వెళ్లి రైతుల వద్ద తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని, పత్తి సాగు చేయని రైతుల పట్టా పాస్ బుక్,ఆధార్ కార్డులను సేకరించి వారే అమ్ముతున్నట్లు చూపిస్తూ సీసీఐ కేంద్రాల్లో అమ్ముతున్నారని,దీనితో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారని అంటున్నారు.

ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని, ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేసేందుకు రైతు రుణమాఫీ చేసి, మద్దతు ధర ప్రకటించి, బోనస్ ఇస్తుంటే, అధికారులు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు… వైరల్ అవుతున్న వేణు స్వామి వీడియో!