ఏటీఎంలోకి దూసుకెళ్లిన కారు.. కొత్తది కొన్నాడు అంతలోనే..
TeluguStop.com
కారు కొనడం అంటే అదో స్టేటస్ మాత్రమే కాదు.కొత్త కారు కొనడం అంటే అదో భావోద్వేగం.
ఓ ఇంటి సంబరం.కుటుంబసభ్యుల ఆనందం, సంతోషం.
ఇలా ఓ కారు కొన్నారంటే దాని వెనక చాలా మంది ఎమోషనల్ సంబంధం ఉంటుంది.
కానీ ముచ్చట తీరకముందే దానికి ప్రమాదం జరిగితే గుండె పగిలిపోతుంది.అదే జరిగింది విశాఖపట్నం జిల్లాలో.
అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే.అది విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడ.
ఓ వ్యక్తి కొత్త కారు కొన్నాడు.దానికి సిటీ నగర్ లోని చర్చి వద్ద పూజాది కార్యక్రమాలు చేయించాడు.
అనంతరం కారును నడుపుదామని డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు.కొత్త కారు కొన్న ఆనందంతో కారు స్టార్ట్ చేశాడు.
క్లచ్ పట్టి గేరు వేసి నెమ్మదిగా వెళ్దామనుకున్న అంతలోనే రెప్పపాటు సమయంలోనే కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న ఏటీఎంలోకి దూసుకు వెళ్లింది.
అంత తక్కువ సమయంలో దానిని అదుపుచేసే సమయం కూడా లేకుండా పోయింది.కొత్త కారు ఏటీఎంలోకి దూసుకుపోవడంతో కారు తీవ్రంగా డ్యామేజీ అయింది.
ఆ సమయంలో ఏటీఎంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఈ ప్రమాదంలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఏటీఎం డోర్ కూడా ధ్వంసం అయింది.ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఈ ఘటనపై భీమునిపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.