గురుకుల ప్రిన్సిపాల్ గదిలో బీరు సీసాలు…రోడ్డెక్కిన విద్యార్ధినులు

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం(Suryapet Rural Mandal ) బాలెంల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రూమ్ లోని బీరువాలో బీరు బాటిళ్లు బయటపడడంతో శనివారం కళాశాల విద్యార్థినులు మళ్ళీ ఆందోళన బాట పట్టారు.

ప్రిన్సిపాల్ శైలజ తన ఆఫీస్ లో తరచూ మద్యం సేవిస్తూ సమస్యలపై ప్రశ్నిస్తే సిబ్బందితో కలిసి తమను వేధిస్తూ నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కళాశాలలోనే కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి అర్ధరాత్రి వేళ మద్యం సేవిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కళాశాలను సొంత ఇంటిలా మార్చారని ఆరోపించారు.

ప్రిన్సిపాల్ కార్యాలయంలో మద్యం సీసాలు ఉన్న విషయం తెలుసుకున్న తాము ప్రిన్సిపల్ రూమ్ కి తాళం వేశామని, తక్షణమే ఉన్నతాధికారులు వచ్చి విచారణ చేసి ప్రిన్సిపల్ ని విధుల నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగామన్నారు.

విషయం తెలుసుకున్న సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్ రావు కళాశాలల ఆర్సీవో అరుణ కుమారి,జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి,డిఎస్పీ రవికుమార్,టౌన్ సిఐ రాజశేఖర్,రూరల్ ఎస్సై బాలు నాయక్ కళాశాలకు చేరుకుని వాస్తవాలను విచారించి, ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని,అప్పటివరకు వైస్ ప్రిన్సిపాల్ ఇంఛార్జి ప్రిన్సిపాల్ గా ఉంటారని హామీ ఇచ్చినా విద్యార్థినులు శాంతించలేదు.

తరచూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని,ముందు సస్పెండ్ చేసి విచారణ చేయాలని అలాగే తమకు ఇంచార్జీ ప్రిన్సిపాల్ వ్యవస్థ మీద నమ్మకం లేదని, రెగ్యులర్ ప్రిన్సిపాల్ ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు మరోసారి విద్యార్ధినులతో మాట్లాడి ప్రిన్సిపాల్ శైలజ ను సస్పెండ్ చేస్తామని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు శాంతించారు.

ఇదిలా ఉంటే అమ్మాయిల కళాశాల బీరువాలో బీరు బాటిళ్లు లభ్యం కావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు.

ఇలాంటి ప్రిన్సిపాల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.

ప్రార్ధనా స్థలాల వద్ద నిరసనలపై నిషేధం .. కెనడాలోని రెండు సిటీ కౌన్సిల్స్‌ తీర్మానం