బీఎల్ఏ దాడి.. ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ రైలు హైజాక్

పాకిస్తాన్‌లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మంగళవారం "జాఫర్ ఎక్స్‌ప్రెస్"('Jaffer Express' ) రైలును హైజాక్ చేసింది.

బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న బీఎల్ఏ(BLA), 100 మందికి పైగా ప్రయాణికులను అదుపులోకి తీసుకుని బందీలుగా చేసుకున్నట్లు ప్రకటించింది.

ఈ ఘటనలో ఆరుగురు పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు సమాచారం.పాకిస్తాన్ నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మీద బీఎల్ఏ గుంపులు కాల్పులు జరిపాయి.

తొమ్మిది బోగీలతో 400 మందికిపైగా ప్రయాణికులు ఉన్న ఈ రైలును బలూచ్ యోధులు రైల్వే పట్టాలను పేల్చి బలవంతంగా ఆపించారు.

అనంతరం రైలులోకి చొచ్చుకెళ్లి ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు.ఈ ఘటనపై బీఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

"పాకిస్తాన్ దళాలు ఏదైనా ఆపరేషన్ ప్రారంభిస్తే బందీలను చంపేస్తాం" అని ఆయన హెచ్చరించారు.

బీఎల్ఏ ఈ ఆపరేషన్ పూర్తి బాధ్యత తీసుకుంటుందని ప్రకటించింది. """/" / పాకిస్తాన్ భద్రతా దళాలు (Pakistan Security Forces)సంఘటన జరిగిన బోలాన్ జిల్లాలోని ముష్కాఫ్ ప్రాంతానికి చేరుకున్నాయి.

బలూచిస్తాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలు అమలు చేసింది."ఇప్పటికే అన్ని భద్రతా సంస్థలను సమీకరించాం.

పరిస్థితిని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం" అని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ తెలిపారు.

నిజానికి బలూచిస్తాన్ ప్రాంతంలో దశాబ్దాలుగా స్వాతంత్య్రం కోసం పోరాటం కొనసాగుతోంది.బలూచ్ ఉద్యమకారులు "పాకిస్తాన్ తమను అక్రమంగా కలుపుకుంది" అంటూ ఆరోపిస్తున్నారు.

బలూచిస్తాన్‌లో పాక్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలు చేస్తోందని, నిర్దోషులను వేధిస్తోందని బలూచ్ యోధులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్ చేస్తూ పలు దాడులు నిర్వహిస్తోంది.

"""/" / ఈ హైజాక్ ఘటనతో బలూచ్ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్‌ను అదుపులో ఉంచే ప్రయత్నాలు చేస్తూనే, అక్కడి విప్లవ గుంపులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నాయి.

ఈ సంఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, భద్రతా దళాలు బందీలను ఎలా రక్షిస్తాయో వేచిచూడాల్సిందే! .