రండి రండి దయచేయండి : ఆ సీనియర్లకు బీజేపీ ఆఫర్ ?

ప్రత్యర్థి పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని, మరింత బలోపేతం అవడంతోపాటు, ఆ పార్టీని మరింత బలహీనం చేయాలనే అభిప్రాయానికి కేంద్ర అధికార పార్టీ బిజెపి వచ్చినట్టు కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులుగా, రాజకీయ ఉద్దండులుగా ఉన్న కొంతమంది నేతలకు బీజేపీ ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ, వారికి బీజేపీ కండువా కప్పాలి అని చూస్తోంది.

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సోనియా ని ఉద్దేశించి రాసిన లేఖ పెద్ద సంచలనం అయ్యింది.

ఆ తర్వాత సిడబ్ల్యుసి సమావేశంలోనూ పెద్ద దుమారమే రేపింది.ఇక కాంగ్రెస్ సీనియర్లకు సోనియాకు లేఖ రాయడంపై రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పు పట్టడమే కాకుండా, వారంతా బీజేపీతో లాలూచీపడి కాంగ్రెస్ ను బలహీనం చేయాలని చూస్తున్నారు అంటూ వ్యాఖ్యానించడం పెద్ద వివాదమే అయ్యింది.

ఆ వ్యాఖ్యలు తాను చేయలేదు అంటూ రాహుల్ వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి ఇఆర్పిఐ అధినేత రామదాస్ అథవాలే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ నాయకులుగా ఉన్న గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్ వెంటనే కాంగ్రెస్ ను వదిలి బిజెపిలో చేరాలని సూచించడంతో పాటు, కాంగ్రెస్ కోసం వీరంతా ఎంతో కష్టపడ్డారని, కానీ వారిని పట్టించుకోకుండా అవమానానికి గురి చేశారని, సరైన గౌరవం లేని ఆ పార్టీలో ఉండడం ఎందుకని, బిజెపిలో చేరాలని ఆయన వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.

ఈ సందర్భంగా రాహుల్ సైతం విమర్శించారు.ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకులపై రాహుల్ అనుచితంగా విమర్శ చేయడంతోనే వారిని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నాము అంటూ రాందాస్ చెప్పుకొచ్చారు.

వీరంతా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డారని, ఇప్పుడు ఆ పార్టీలో విలువ లేదు కాబట్టి, వారంతా బీజేపీ లోకి రావాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో 23 మంది రాసిన లేఖపై దుమారం కొనసాగుతూనే ఉంది.

రాహుల్ తీరుపై కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో, వారందరినీ ఒక్క బిజెపిలో చేర్చుకోవాలని, క్రమంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనం చేసి కేంద్రంలో తమకు ఎదురులేకుండా చేసుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది.