నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసి అన్నదాతలను కాపాడండి:జెఎస్ఆర్

నల్లగొండ జిల్లా:తొలకరి చినుకుల్లో రైతన్న ఆశలు మొలకెత్తితే,ఖరీఫ్ విరగపండుతుందని పొలంలో నాటింది సంక్షోభ బీజాలైతే,నకిలీ విత్తుల( Fake Seeds ) విచ్చుకత్తుల వాడికి ఆకుపచ్చని కలలు తెగటారిపోతాయని కార్మిక,కర్షక ప్రజాబంధువు కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జేఎస్ఆర్ నేతాజీ అన్నారు.

గురువారం విత్తు దగ్గరే అన్నదాత చిత్తవుతున్నాడని, కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలతో అన్నదాతలను నిండా ముంచుతున్నారని బాధితుల బంధువు, బహుజన నేస్తం జేఎస్ఆర్ నేతాజీ( JSR Netaji ) తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బహిరంగ లేఖ రాశారు.

దురదృష్టవశాత్తు దేశంలో విత్తనగండ విషాద దృశ్యాలు ఏటా పునరావృతమవుతూనే ఉన్నాయని,ఏడు నెలలకిందట దేశ రాజధాని ఢిల్లీ( Delhi )లో 28 టన్నులకు పైగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయన్న కథనం తనలాంటి సామాన్య పౌరుల గుండెల్లో గగ్గోలు పుట్టించిందన్నారు.

నకిలీ విత్తనాలతోనష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి ఆదుకోవాలని కోరారు.పుట్టగొడుగుల్లా ప్రతి ఏటా పుట్టుకొస్తున్న నకిలీ బ్రాండ్ల నుండి భారత రైతన్నను కాపాడుకోవాలని,సిండికేట్గా మారిన అక్రమార్కుల అవినీతి అక్రమాల అంతం చేయాలని కోరారు.

అధికారుల ఉత్తుత్తి తనిఖీల కాలయాపన చేయటం మానుకోవాలని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నకిలీ బ్రాండ్,కంపెనీలను అరికట్టడంలో విఫలం చెందాయని ఆరోపించారు.

స్టాక్ రిజిస్టర్లపైనే అధికారుల దృష్టి పెట్టారని,ఏటేటా నష్టపోతున్న రైతన్నల గురించి ఇకనైనా పాలకులు శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు పల్లెల్లో నకిలీ విత్తనాలనునేరుగా రైతులకే అంటగడుతున్న దళారులసంఖ్య పెరిగిపోతూ ఉందని,అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా అక్రమ వ్యాపారానికి పూర్తిస్థాయిలో మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారనిఆందోళన వ్యక్తం చేశారు.

ఆగని నకిలీ దందాపై పాలకులారా ఇంకెప్పుడు యుద్ధం చేస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారు.

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా,ఆలస్యంగా అగ్రి,టాస్క్ఫోర్స్ దాడులు మొదలవుతాయని చివరికి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారని విమర్శించారు.

తీరు మారని వ్యాపారుల రీసైక్లింగ్ తో భారతీయ రైతులు అడుగడుగునా మోసపోతున్నారన్నారు.ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయని, గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాల అక్రమ దందా షురువైందని,సకాలంలో వ్యవసాయ శాఖ,టాస్క్ఫోర్ స్పందించాలని కోరారు.

వర్షాకాలం ఆరంభం కాకముందే వానాకాలం వ్యవసాయ పనులు మొదలు కాక ముందే ఇదే అదనుగా అన్నదాతలను ఆగం చేసేందుకు డూప్లికేటుగాళ్లు రెడీ అవుతున్నారని తెలిపారు.

ఏటా నకిలీ,నాణ్యతలేని విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, నకిలీ బ్రాండులు, కంపెనీలు,మొలకెత్తే శాతం తక్కువ ఉన్న విత్తనాలను విక్రయిస్తూ రైతులను దెబ్బతీస్తున్నాయని,విత్తన మార్కెట్లో అక్రమార్కులు అనేక విధాలుగా మోసాలకు పాల్పడుతున్నా వారిని గుర్తించడంలో వ్యవసాయ శాఖ,టాస్క్ఫోర్స్ అధికారులు విఫలమతున్నారని స్వయంగా రైతు అయిన బాధిత రైతుల బంధువు కన్నీరు కార్చారు.

ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించడం,డిమాండ్ ఉన్న సీడ్స్ కూ సిండికేట్ గా మారి బ్లాక్లో విక్రయించడం,కంపెనీల అడ్రస్ లేని విత్తనాలు విక్రయించడం,కృష్ణా, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి రోజువారిగా తీసుకువచ్చి నాణ్యతలేని విత్తనాలు విక్రయిస్తున్నా అధికారుల దృష్టికి మాత్రం రావడం లేదని అన్నారు.

విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలిపి, ఎంతమొత్తం కొనుగోలు చేయగల వీలుందో వెల్లడించి,నాణ్యతను ధ్రువీకరించే కేంద్రీకృత ఆన్లైన్ వ్యవస్థ (సాధి పోర్టల్) కు శ్రీకారం చుట్టాలని సూచించారు.

అన్నదాతల సంక్షేమం గురించి,నకిలీ విత్తనాల విరుగుడు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత గొప్పగా ప్రచార ఆర్భాటాలకు శ్రీకారం చుట్టినా ఇప్పటికీ వాస్తవ పరిస్థితి ఇంకా మెరుగుపడనే లేదని, నకిలీ విత్తన దందాపై తనలాంటి ఎందరెందరో సామాజిక కార్యకర్తలు, ప్రజా ఉద్యమకారులు ఎన్నో రకాలుగా ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నప్పటికీ, పత్రికల్లో ప్రధాన వార్తలు ప్రచురణ అవుతున్నప్పటికీ,నకిలీ విత్తనాల మార్కెట్ దండనం అరికట్టలేకపోతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.

ఏపీ, కర్ణాటక,మహారాష్ట్రల నుంచి బీటీ పత్తి,మిరప విత్తనాలు తీసుకొచ్చి తెలంగాణలో విక్రయిస్తున్న ముఠాల కదలికలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.

ఛత్తీస్గఢ్,గుజరాత్ ప్రభృత రాష్ట్రాల నుంచీ మొక్కజొన్న,సోయా తదితరాల నకిలీ సరకూ వెల్లువెత్తుతోందని,నాసి, నకిలీ విత్తన సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతాం, పీడీ చట్ట ప్రయోగంతో ముష్కరమూకల పీచమణుస్తామన్న హెచ్చరికలు వాస్తవిక కార్యాచరణలో పెద్దగా ప్రభావం కనబరచలేక పోతున్నాయన్నారు.

పత్తి, మిరప సాగుపట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెచ్చుమీరుతున్న మోజును సొమ్ము చేసుకునే కుయత్నాల్ని, ఇతరత్రా వంగడాల రూపేణా మోసాల్ని వరస తనిఖీలతోనే కట్టడి చేయాలని కోరారు.

అందులో ప్రభుత్వాల పరంగా ప్రణాళికలు చురుగ్గా పదును తేలకపోతే,పొంచి ఉన్న పెనువిత్తన గండం నుంచి తెలుగు రైతులు తప్పించుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు.

సుక్షేత్రాల్లో కల్తీ ఉగ్రవాదమన్నది తరతమ భేదాలతో దేశం నలుమూలలా రైతాంగానికి జీవన్మరణ సమస్యగా పరిగణించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

నకిలీ విత్తనరాశి ఉత్పత్తవుతున్నది ఎక్కడైనా,అది రాష్ట్రాల సరిహద్దులు దాటి అన్నదాతల పుట్టి ముంచుతోందని,నాసి, నకిలీ విత్తనాల కారణంగా అప్పో సప్పో చేసి రైతులు కూడగట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయని,ఈ విషయం మీదనే సూర్యాపేట జిల్లా ఏపూర్ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు తన మేనమామ నిరంతర శ్రమజీవి మున్న గురువయ్య యాదవ్ కన్నీరు పెట్టుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ రైతుల నెత్తిన రుణభారాన్ని పెంచేస్తున్నాయని, ఉత్పాదకత తెగ్గోసుకుపోయి దేశార్ధికమూ కుంగుతోందని బాధపడ్డారు.

మన దేశ రైతాంగానికి మేలిమి వంగడాలు అందించే లక్ష్యంతో ఆరు దశాబ్దాల కిందట జాతీయ విత్తన సంస్థను కొలువు తీర్చారని,రాష్ట్రాల్లో విత్తనాభివృద్ధి సంస్థలు తరించాయని,దశాబ్దాలుగా విత్తనాభివృద్ధి పద్దుకింద వ్యవసాయ విశ్వవిద్యాలయాలు,సేద్య పరిశోధన సంస్థల్లో వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, వాటన్నింటి ఉమ్మడి వైఫల్యానికి,నకిలీ విత్తన ముఠాల ఆమానుషకాండకు రైతులు భారీ మూల్యం చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నదాతల బతుకులతో చెలగాటమాడుతున్న సామాజిక ద్రోహుల్ని క్రూర నేరగాళ్లుగా పరిగణించి కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అన్నదాతల ఆత్మహత్యలకు కారకులవుతున్న దేశద్రోహులైన దళారి వ్యాపార ముఠాలతో చేతులు కలిపి తూతూ మంత్రంగా విత్తన నాణ్యతను ధ్రువీకరించిన అవినీతి అధికారుల భరతం పట్టాలని కోరారు.

మరోవైపు ఉత్తమ వంగడాల సేకరణ మార్గాల్నీ పెంపొందించుకోవాలని, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత రైతులు విత్తనోత్పత్తిలో అద్భుతాలు సృష్టిస్తున్నారని, భూసారాన్ని పరిరక్షిస్తూ అక్కడ ఉత్పత్తి చేస్తున్న మేలు రకం విత్తులకు విదేశాల్లోనూ గిరాకీ ఉందని ప్రశంసించారు.

అన్నంపెట్టే రైతును వంచించొద్దని, వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు.నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని,కల్తీ విత్తనాలు అమ్మితే అమ్మిన వ్యాపారస్తుల ఆస్తులను జాతీయం చేయాలని జనహితమే తన జీవిత ధ్యేయమై అనుక్షణం అట్టడుగు వర్గాల ఆవేదనను అక్షర రూపాలలో పాలకులకు లేఖల మీద లేఖలు రాస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కమ్యూనిస్టు విప్లవకారుడు జెఎస్ఆర్ నేతాజీ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

నకిలీ విత్తనాల పంజాతో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల వ్యవసాయ రైతులు, అన్నదాతలూ విలవిల లాడుతున్నారని పేర్కొన్నారు.

ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న ఆశలేదని,కొందరు కేటుగాళ్ళ కారణంగా అన్నదాతలకు అగచాట్లు తప్పడంలేదని,తెలుగు రాష్ట్రాలలో మారుమూల గ్రామాలపై నకిలీ విత్తనాలు పంజా విసురుతూ అమాయక రైతులే టార్గెట్ గా కార్యకలాపాలు అప్పుడే మొదలెట్టేశారని, తెలుగు రాష్ట్రాలలోని అనేక జిల్లాలలో నిషేధిత పత్తివిత్తనాలు అమ్మే ముఠాలు ఎక్కడి నుంచివస్తున్నాయో తెలీడం లేదని,రైతు నేస్తం, కార్మిక కర్షక హక్కుల కోసం గత 30 సంవత్సరాలుగా తన వంతుగా పోరాటాలు కొనసాగిస్తున్న నూతన ప్రజాస్వామిక విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్ జేఎస్ఆర్ నేతాజీ తెలుగు రాష్ట్రాలలోని రైతుల తరఫున బాధను వ్యక్తం చేశారు.

నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగాఆదుకోవాలని డిమాండ్ చేశారు.కొత్త ప్యాకెట్లో పాత విత్తనాలు అమ్ముతున్నారని,గడువు ముగిసిన విత్తనాలను కొత్త ప్యాకెట్లో వేసి అమ్ముతున్న ముఠాలను కఠినంగా శిక్షించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రముఖుల అవినీతి అధికారుల అనేకమంది అమాత్యుల అండదండలతోనే నకిలీ విత్తనాల దొంగ వ్యాపారం కొనసాగిస్తున్నారని,నకిలీ విత్తనాల వ్యాపారానికి కొంతమంది అధికారులతో పాటు రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతోనే వ్యాపారానికి మార్గం సుగుమం అవుతుందనిఆరోపించారు.

కల్తీ విత్తనాలను విక్రయిస్తూ పట్టుబడ్డ వారికి, నమోదవుతున్న కేసుల మధ్య కూడా వ్యత్యాసం ఉంటుందని,వ్యవసాయ, పోలీసు శాఖలు ఇందుకు బహిరంగంగా సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.

నకిలీ విత్తనాలకు సంబంధించి మండల, జిల్లా కేంద్రాల్లోని సీడ్ షాపుల్లో అధికారుల తనిఖీలు తూతూ మంత్రంగానే ఉంటున్నాయని,దీంతో పాటు కొంతమంది అధికారులు నకిలీగాళ్ల అమ్యామ్యాలకు తావివ్వడంతో కూడా ఈ వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు.

ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నేతలు రైతుల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నకిలీగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలనుకోరారు.

తమిళనాడుకు చెందిన యువతి ప్రియ భిన్న విత్తనాల సేకరణకు, వందల రకాల దేశవాళీ కూరగాయల సాగుకు పెట్టింది పేరని,తెలుగు రాష్ట్రాలలో కూడా ఎందరెందరో ఆదర్శ రైతులు ఉన్నారని, అటువంటి వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే దేశీయంగా వార్షిక విత్తన గండాల పీడ విరగడవుతుందని,పంట దిగుబడులు విస్తరించి, రైతుల జీవితాలు తెరిపిన పడతాయని ప్రజా నేస్తం, సంఘసంస్కర్త,కార్మిక కర్షక ప్రజా శ్రేయోభిలాషి,సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయం చేసే రైతుల సమస్యలపై రాసిన బహిరంగ లేఖల విజ్ఞప్తి చేశారుతెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం చేస్తున్న రైతు,కూలీలు మరియు కౌలరైతులుఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ఒక మంచి పుస్తకాన్ని తీసుకురాబోతున్నట్లు రైతు బాంధవుడు జేఎస్ఆర్ నేతాజీ తెలిపారు.

అన్నదాతలకు ఎన్ని కష్టాలు అనే పేరుతో ప్రచురించే ఈ పుస్తకంలో రైతుల సమస్యలను సంక్షిప్తంగా,సమగ్రంగా మంచిగా వివరించిన వారికి చక్కటి బహుమతులు సైతం అందిస్తామని,అలాగే రైతుల సమస్యలపై కవితలు,పాటలు కూడా ఇందులో చేరుస్తామని తెలిపారు.

రచయితలు, కవులు,కళాకారులు, మేధావులు తమ రచనలనూ తన తండ్రి గారైన ఆదర్శ రైతు జై బోరన్న గారి చంద్రశేఖర ఆజాద్ రాజా బాపూజీ జెసిఆర్ (బోరా చంద్రన్న యాదవ్ రెసిడెన్సి)పోస్ట్ అండ్ విలేజ్:తాళ్ల ఊకళ్ళు,మండలం:మరిపెడ బంగ్లా,జిల్లా: మహబూబాబాద్, పిన్కోడ్ నెంబర్: 506 315 కు పంపగలరని, అలాగే,వాట్సప్ ద్వారా ఈ క్రింద పేర్కొన్న 9848540078, 83282772852 ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా కూడా పంపవచ్చునని రైతు కూలీ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పరితపించే సామాజిక ఉద్యమకారుడు,కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

ఆ విషయంలో అమ్మాయిలకు హ్యాట్సాఫ్… విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్!