అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ ... సూపర్ మార్కెట్‌లో కాల్పులు, పది మంది మృతి

గత నెలలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సబ్‌వేలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనను మరిచిపోకముందే అమెరికాలో మరోసారి ఉన్మాదులు రెచ్చిపోయారు.

న్యూయార్క్‌లోని టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

ఈ ఘటనలో పది మంది మరణించగా.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఓ యువకుడు సైనికుడిలా లోపలికి ప్రవేశించి మారణహోమం సృష్టించాడు.మరణించిన వారిలో 8 మంది నల్లజాతీయులు, ఇద్దరు శ్వేతజాతీయులు వున్నట్లు పోలీస్ అధికారి జోసెఫ్ గ్రామగ్లియా వెల్లడించారు.

జాతి విద్వేషమే ఈ ఘటనకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ దారుణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సూపర్ మార్కెట్‌ బఫెలో డౌన్‌టౌన్‌లో ఉత్తరాన దాదాపు 3 మైళ్ల దూరంలో నల్లజాతీయులు ఎక్కువగా వుండే ప్రాంతంలో వుంది.

ఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.దీనిపై టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్స్ ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఈ హింసాత్మక చర్యకు తాము షాక్‌కు గురయ్యామని.ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా వుంటామని తెలిపింది.

ఈ ఘటనపై న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తన స్వగ్రామమైన బఫెలోలోని కిరాణా స్టోర్‌లో జరిగిన ఈ కాల్పులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

రాష్ట్ర అధికారులు.స్థానిక అధికారులకు సహాయం చేస్తున్నారని తెలిపింది.

కాగా.కొలరాడో రాష్ట్రం బౌల్డర్‌లోని కింగ్ సూపర్స్ కిరాణా దుకాణంలో మార్చి 2021లో జరిగిన ఘటనలో పది మంది మరణించిన తర్వాత ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి.

నాటి దాడిలో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి సూపర్ మార్కెట్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు అధికారులు నేటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదు.. నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!