పంచాయతీ పోరుకు ఏర్పాట్లు షురూ..!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ముగియగానే పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభం కానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

సర్పంచ్ ఎన్నికలకు అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని,ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు 2019 జనవరిలో మూడు విడుతలు నిర్వహించగా గ్రామాల్లో ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ సహా కొత్త కార్యవర్గం కొలువుదీరింది.

వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1తో ముగిసింది.దీంతో గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగిస్తోంది.

పార్లమెంటు ఎన్నికల కారణంగా ఇప్పటికే ఈ ప్రక్రియ ఆలస్యమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఈనెల 13వ తేదీ వరకు పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు వేగం చేశారని సమాచారం.

ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారుల నియామకం,ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలను ప్రారంభించాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 1,740 జీపీలు,72 మండలాలు ఉన్నాయి.పార్లమెంట్​ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి స్థానిక సమరంపై పడింది.

జూన్​లో ఎంపీ ఎన్నికల ఫలితాలు వచ్చాక స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.ఎన్నికల మెటీరియల్,​అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల అంశాన్ని ఈ ప్రభుత్వం మార్చే ఆలోచన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

కానీ,ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.పంచాయితీ రాజ్ కొత్త చట్టం ప్రకారం గత ప్రభుత్వం రెండు టర్ముల వరకు ఒకటే రిజర్వేషన్లు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఎన్ఆర్ఐతో భూ వివాదం .. పంట కోసేందుకు యత్నం, కాల్పులతో వణికిన పల్లెసీమ