అరిబండి జీవితం ఆదర్శప్రాయం…!

సూర్యాపేట జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధులు,మాజీ ఎమ్మెల్యే అరిబండి లక్ష్మీనారాయణ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పాలకవీడు మండల సీపీఎం కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ అన్నారు.

గురువారం మండల కేంద్రంలో అరిబండి 25వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, స్నేహశీలి, రైతాంగ సాయుధ పోరాట యోధుడు అరిబండి లక్ష్మీనారాయణ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.

సిపిఎం పార్టీ అభ్యర్థిగా ప్రజా మద్దతుతో మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారని, ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని, అనేక మౌలిక వసతులు కల్పించిన చరిత్ర ఆయనదని కొనియాడారు.

అంతే కాకుండా సిపిఎం పార్టీ బలోపేతానికి అనేక ప్రజా పోరాటాలను చేశారని గుర్తు చేశారు.

అనేక నిర్బంధాలు ఎదురైనా,దాడులు చేసినా అదరక బెదరక నిరంతరం దళిత,బడుగు,బలహీన వర్గాల పక్షాన,రైతాంగ, వ్యవసాయ కూలీల, మహిళా సమస్యలపై పోరాడి సమస్యలను పరిష్కరించిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు.

ఆయన నిరాడంబరత, పోరాట స్ఫూర్తితో మనమందరం ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్,సిపిఎం మండల నాయకులు ఏసురత్నం,కొండా పెద్ద ఎల్లయ్య,మీసాల సోములు,పొదిల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

అల్లరి నరేష్ అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్నాడా..?