టీడీపీ నేతలకు పైసల్లేక ప్రెస్‌మీట్లూ పెట్టట్లేదా ?
TeluguStop.com
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎన్నో రాజకీయ సంచలనాలకు వేదిక అయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారానికి దూరమై 17 ఏళ్లు అవుతోంది.
2004, 2009లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోయిన తెలుగుదేశం 2014లో రాష్ట్ర విభజన జరిగాక ఏపీలో గెలిచినా తెలంగాణలో ఓడిపోయింది.
ఇక 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.పైగా ఆ ఎన్నికల్లో టీడీపీకి చిరకాల రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఘోరంగా ఓడిపోయింది.
ఇక ఏపీలోనూ 2019లో ఎన్నికల్లో ఓడిపోవడంతో తెలుగుదేశం కష్టాలు మామూలుగా లేవు.గత ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా ఏపీలో పార్టీని బతికించుకోవడానికి చంద్రబాబు, పార్టీ నేతలు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి.
ఏపీలోనే ఇలా ఉంటే 17 ఏళ్లుగా అధికారంలో లేని తెలంగాణలో పార్టీ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.
ఏపీలో అధికారంలో ఉన్న ఐదేళ్లు తెలంగాణలో పార్టీ కార్యాలయం నిర్వహణతో పాటు ఇతర కార్యక్రమాల ఖర్చులకు పెద్ద ఇబ్బంది ఉండేదే కాదు.
అవసరమైతే ఏపీ నుంచి నిధులు బాగానే వెళ్లాయి.2018 ముందస్తు ఎన్నికల్లో కూడా నాడు టీడీపీ పోటీ చేసిన 13 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఖర్చును ప్రముఖ కాంట్రాక్టర్లకు అప్పగించారు.
అప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో ఎవరో ఒకరు ఏదో ఒక లబ్ధి కలుగుతుందని పెట్టారు.
ఇప్పుడు రెండు చోట్లా అధికారంలో లేదు సరికదా ? చరిత్రలోనే లేనంత ఘోరమైన స్థితిలో ఉండడంతో చివరకు చిన్నా చితకా కార్యక్రమాలకు ఖర్చులు లేని దుస్థితి ఎదుర్కొంటోంది.
తెలంగాణలో ప్రెస్‌మీట్లకు డబ్బులేవ్ ?
ఉమ్మడి ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయంగా ఉన్న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ ఎప్పుడూ కళకళలాడేది.
ఇక రాష్ట్ర విభజన తర్వాత ఇది తెలంగాణ టీడీపీ కార్యాలయంగా మారింది.ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నుంచే ఇక్కడ పార్టీ ఆఫీస్‌ను కూడా కంట్రోల్ చేసేవారు.
ఇక ఇప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్‌ను కూడా పట్టించుకునే వాళ్లు లేక బోసీపోయింది.
గతంలో పార్టీ ప్రెస్‌మీట్లకు కార్యాలయానికి వచ్చేవారికి రవాణా చార్జీలు అయినా ఇచ్చి పంపేవారట.
ఇప్పుడు అవి కూడా ఇవ్వకపోవడంతో చివరకు ప్రెస్‌మీట్లు పెట్టేందుకు కూడా ఎవ్వరూ ఎన్టీఆర్ భవన్‌కు రావడం లేదు.
"""/"/
ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు పైసా కూడా ఖర్చులకు ఇవ్వలేదు.
ఇటీవల తెలంగాణలో పార్టీ పదవులు వచ్చిన వారు కూడా ఊసురోమంటూ ఉన్నారు.వీరు బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.
అనవసరంగా చేతిచమురు ఎందుకు వదిలించుకోవాలి ? పార్టీ అధికారంలోకి రాదు.పైసా ఉపయోగం ఉండదన్న నిర్ణయానికి వచ్చేశారు.
చివరకు పార్టీలో ఇక్కడ అక్కడక్కడా మిగిలిన ఉన్న వాయిస్ ఉన్న నేతలు అయినా ప్రెస్‌మీట్లు పెట్టేందుకు అయినా పార్టీ కార్యాలయానికి రావాలన్నా.
పార్టీ కార్యాలయాన్ని నడిపించాలన్నా కొంత నిధి ఏర్పాటు చేస్తే మంచిదని చంద్రబాబుకు ప్రతిపాదనలు పంపారట.
అయితే ఆ ప్రతిపాదనను చంద్రబాబు ఇప్పటి వరకు పట్టించుకోలేదని తెలుస్తోంది.ఏదేమైనా పార్టీ ఏపీలో ఓడిన యేడాదిన్నరకే కనీసం ఎన్టీఆర్ భవన్ నిర్వహణకు కూడా ఖర్చులు లేని స్థితిలో టీడీపీ ఉండడం ఆ పార్టీ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది.
మరి చంద్రబాబు ఇప్పటకి అయినా ఈ విషయాలపై దృష్టి పెడతారేమో ? చూడాలి.
దేవర2 మూవీ గురించి కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇదే.. అప్పుడే షూట్ మొదలంటూ?