నేను మోనార్క్ ని నన్నేమీ చేయలేరంటున్న అమ్మగూడెం గ్రామ సెక్రటరీ
TeluguStop.com
నల్లగొండ జిల్లా: కనగల్ మండలం అమ్మగూడెం గ్రామ పంచాయతీ సెక్రటరీ సుంకిరెడ్డి నర్సింహారెడ్డి వ్యవహారశైలి చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందేనని గ్రామస్తులు అంటున్నారు.
ఆయన 2019 నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు.కానీ,ఆఫీస్ కు రాకుండా ఇంటి దగ్గర నుండే విధులు నిర్వహించడం ఆయన ప్రత్యేకత.
అధికారి తనిఖీకి వచ్చినట్లు నెలకు ఒక్కసారి ఆఫీస్ కు వచ్చి అటెండెన్స్ రిజిష్టర్ లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతాడు.
ఎవరైనా అడిగితే నేనింతే,నేను మోనార్క్ ను నన్నేమీ చేయలేరు,ఇక్కడ నేనే ఎమ్మేల్యే,నేనే మంత్రిని అంటూ బెదిరింపులకు దిగుతాడు.
అయినా అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోవడం తప్ప చర్యలేమీ ఉండవు.ఇదేకాదు ఆయన పెట్టిన వర్కర్స్ మాత్రమే గ్రామంలో పని చేయాలని హుకూం జారీ చేసి, వారితోనే పాలన సాగిస్తారని,గ్రామస్తులకు ఏదైనా సమస్య వచ్చినా సారు వారికి పట్టదని,గ్రామ పంచాయితీకి వచ్చే జనరల్ ఫండ్ సొంతానికి వాడుకోవడం,రిజిస్ట్రేషన్, ఇంటి ఫర్మిషన్ విషయంలో ఆయన గారికి అడిగినంత ముట్టజెప్పితేనే పని జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇక్కడే కాదు ఈ సారు ఎక్కడ పనిచేసినా ఇదే తంతు ఉండేదటని,అంతేకాదు మల్టీ పర్పస్ వర్కర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని ఇదే గ్రామానికి చెందిన మాచర్ల నరేష్ దగ్గర కొంత అమౌంట్ వసూల్ చేశారని,
థంబ్ పడని పెన్షన్ దారుల నుండి పెన్షన్ అమౌంట్ ఇచ్చి మనిషికి 500 వసూలు చేసేవాడని,గ్రామ పంచాయతీ తీర్మానాలు కూడా ఇంటి దగ్గర నిర్వహిస్తారని అనేక ఆరోపణలు చేస్తున్నారు.
గ్రామ సభలు అంటేనే ఆయనకు గిట్టదని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇవన్నీ అధికారులకు తెలిసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గ్రామస్తులను విస్మయానికి గురిచేస్తోందంటున్నారు.
అధికారులు అందరూ నా స్నేహితులు అంటూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ అవినీతి,అక్రమాలకు పాల్పడినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేకపోవడం ఏమిటో అర్థంకాక గ్రామ ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.
నిజంగానే అతనే ఎమ్మేల్యే,అతనే మంత్రినా? కాకుంటే అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సదరు సెక్రెటరీపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.. సినీ ఇండస్ట్రీలో నయా సెంటిమెంట్!