ఎండోమెట్రియాసిస్‌తో నరకయాతన: అమెరికన్ మహిళకు కొత్త జీవితాన్నిచ్చిన భారతీయ వైద్యులు

భారతదేశం వైద్య రంగంలో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చికిత్స కోసం విదేశాలకు వెళ్లే స్థాయి నుంచి విదేశీయులే మనదేశానికి వచ్చే స్థాయికి మనం చేరుకున్నాం.

మిగిలిన అన్ని దేశాలతో పోలిస్తే భారత్‌లో చికిత్సకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.

అందుకే ఇండియాలో మెడికల్ టూరిజం బాగా వృద్ధి చెందుతోంది.నిపుణులైన వైద్యులతో పాటు అత్యాధునిక సదుపాయాలున్న ఆసుపత్రులు ప్రస్తుతం మనదేశంలోని అన్ని నగరాల్లోనూ వున్నాయి.

అందుకే విదేశీ రోగులు భారత్‌ను వెతుక్కుంటూ వస్తున్నారు.తాజాగా అమెరికాకు చెందిన 35 ఏళ్ల మహిళకు ముంబైలోని ఏసీఐ కుంబల్లా హిల్ ఆసుపత్రి వైద్యులు అత్యంత సున్నితమైన ప్రేగు ఎండోమెట్రియోసిస్‌‌కు విజయవంతంగా శస్త్రచికత్స నిర్వహించారు.

బోస్టన్‌కు చెందిన ఈమెకు ఎగువ పురీషనాళంలో పెద్ద ఎండోమెట్రియోసిస్ నోడ్యూల్ వుంది.దీని ఫలితంగా బాధితురాలు గర్భం దాల్చలేకపోయింది.

దీనితో పాటు ధీర్ఘకాలిక పీరియడ్ నొప్పి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతోంది.

ముంబై వైద్యుల వల్ల ఇప్పుడు ఆమె తన దినచర్యను తిరిగి ప్రారంభించబోతోంది.అంతేకాదు మనదేశంలోనే త్వరలో పిల్లల కోసం ఐవీఎఫ్ చికిత్సను కూడా తీసుకుంటానని చెప్పింది.

ఏసీఐ కుంబల్లా హిల్ ఆసుపత్రిలోని లాపరోస్కోపిక్, రోబోటిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ మంగేశికర్ మాట్లాడుతూ.

రోగికి చేసిన అల్ట్రాసౌండ్ పరీక్షలో ఎగువ పురీషనాళంలో పెద్ద ఎండోమెట్రియోసిస్ నోడ్యూల్‌ను గుర్తించినట్లు చెప్పారు.

భారతదేశంలో కూడా దాదాపు 25 మిలియన్ల మంది రోగులు ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్నట్లు అభిషేక్ తెలిపారు.

గతేడాది 80 మంది రోగులకు శస్త్రచికిత్స చేశామని ఆయన చెప్పారు.తాజా కేసు విషయానికి వస్తే చికిత్సను కనుక ఆలస్యం చేస్తే పేగుకి అడ్డంకి ఏర్పడి, ప్రాణాంతకమైన సమస్యగా మారుతుందని అభిషేక్ వెల్లడించారు.

మలమూత్ర విసర్జన కష్టమవుతుందని.ఇది పేగు సెప్సిస్‌కు కారణమై, అంతిమంగా రోగి చనిపోవచ్చని చెప్పారు.

ఈ వ్యాధికి సంబంధించి బాధితురాలు అమెరికాలో అనేక మంది వైద్యులను సంప్రదించిందని కానీ ఫలితం లేకపోవడంతో భారత్‌కు వెళ్లాలని నిర్ణయించుకుందని మంగేశికర్ తెలిపారు.

ఆమెకు ఏడు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స చేశామని ఆయన చెప్పారు.

పురాణాలు, ఇతిహాసాలకు ప్రాధాన్యత ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన టాలీవుడ్ సినిమాలివే!